బారీగా వార్షిక లక్ష్యం రూ.311.26 కోట్లు

-: ఇప్పటికి రూ.120.2 కోట్ల ఆదాయం

-: ప్రత్యేక డ్రైవ్‌లకు రవాణా శాఖ సిద్ధం

-:రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ మల్లికార్జున

కర్నూలు టౌన్ , నవంబర్ 16, (సీమకిరణం న్యూస్) :

భారీగా విధించిన టార్గెట్‌లను చేరుకోవడానికి రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలకు సిద్ధమవుతోంది. అధికారులు భారీ ఆదాయం రాబట్టుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర రవాణా శాఖ జిల్లాకు భారీ టార్గెట్‌ను నిర్దేశించిన నేపథ్యంలో దానిని చేరుకునే దిశగా ప్రత్యేక డ్రైవ్‌లు, వరుస తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని కొంతమేరకైనా చేరుకోవటంతో పాటు రవాణా భద్రతను మరింత పటిష్టపరచటమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు తో వాహన తనిఖీలు, కేసుల నమోదు కార్యక్రమం జరగడం లేదు. జిల్లా రవాణ శాఖకు ఆశాఖ కమిషనర్ 2021-2022 సంవత్సరానికి రూ. 311 .26 కోట్ల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో అన్ని కమర్షియల్ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు, మూడు నెలలకు ఒకసారి చెల్లించే త్రైమాసిక టాక్స్‌లు పూర్తి స్థాయిలో వసూలు చేయగలిగితే లక్ష్యాన్ని 90 శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. ఈఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోగా వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. అయితే గడిచిన ఎనిమిది నెలల కాలంలో రూ.120.02కోట్లు ఆదాయం లభించింది. కోవిడ్ కారణంగా కమర్షియల్ వాహనాల పిట్ నెస్ తనిఖీలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. ఈక్రమంలో ఇప్పటి నుండి పూర్తి స్థాయిలో కేంద్రికరించి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఎనిమిది నెలల కాలానికి కనీసం 70 శాతం లక్ష్యం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 64.06 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ మల్లికార్జున రెడ్డి ఆదాయం పెంపుదలే ప్రస్తుత ప్రధాన ఎజెండాగా తీసుకొని ఆయన కసరత్తు ప్రారంభించారు.

By admin