పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ ఇమామ్ వలి
అనంతపురం ప్రతినిధి, ఫిబ్రవరి 23, (సీమకిరణం న్యూస్) :
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా షేక్ ఇమామ్ వలి (యం.యం.డి.ఇమామ్) బుధవారం ఒక సెట్ నామినేషన్, గురువారం రెండవ సెట్ తన భార్య జాహిదా బేగంతో కలసి ఘనంగా నామినేషన్ వేయడం జరిగింది. స్థానిక సూర్యనగర్ యం.యం.డి.ఏ. కార్యాలయం నుండి బహుజనుల మద్దతుదారులతో కలసి బయలుదేరి అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ (ఎఫ్ఏసీ) కేతన్ గార్గ్ గారికి అందజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పరిధిలో వున్న కడప, అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు మొదలగు వారు ఒక్కసారి తనకు మద్దతుగా నిలుస్తు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారి పిలుపుకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాలకు ఒక సేవకుడిలా సేవలందిస్తా అని తెలిపారు. అలాగే చట్ట సభల్లో విద్యావంతుల గొంతునై ప్రతి ఒక్కరి సమస్యలను మరియు రాయలసీమ అభివృద్ధి గురించి తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యం.యం.డి.ఏ. జిల్లా అధ్యక్షుడు యస్.యం. మహబుబ్ భాష, హాజీ బషీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.