
సంక్రాంతి పండగ ఆఫర్లు అంటూ సైబర్ మోసాలు
ఫేక్ షాపింగ్ ల ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ల పేరుతో మోసాలు
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
…డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, జనవరి 09, (సీమకిరణం న్యూస్):
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్, రీచార్జ్ లు, ట్రావెల్ బుకింగ్‌లు , “భారీ డిస్కౌంట్”, “లిమిటెడ్ టైం ఆఫర్”, “సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్” ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్, నకిలీ వెబ్ సైట్ల ద్వారా భారీ తగ్గింపు అని చూపించి మోసం చేస్తారని ఇలా ఆఫర్ల పేరుతో ఆకర్షణీయమైన సందేశాలతో ప్రజలను మభ్యపెడుతూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే ప్రయత్నం చేస్తారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని , సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం తెలిపారు. నకిలీ వెబ్సైట్లు, ఫేక్ షాపింగ్ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనలు, WhatsApp మరియు SMSల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPల ను పొందేందుకు ప్రయత్నిస్తుంటారన్నారు. చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్ కోడ్లను కూడా ఉపయోగిస్తుంటారన్నారు. కొంతమంది మోసగాళ్లు ముందుగా తక్కువ ధర చూపించి చెల్లింపు చేసిన తర్వాత పూర్తిగా కనుమరుగవుతుంటారన్నారు. ప్రత్యేకంగా ఆన్లైన్ లక్కీ డ్రా కూపన్లు, ఉచిత బహుమతుల పేరుతో లింకులు పంపి మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యేలా చేసి డేటా దోపిడీ చేస్తుంటారన్నారు. దీని వల్ల ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయన్నారు.
జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తెలియని ఆఫర్ లింకుల పై క్లిక్ చేయవద్దు.
అనధికారిక వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా కొనుగోళ్లు చేయవద్దు.
OTPలు, CVV, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వవద్దు.
అధికారిక షాపింగ్ యాప్‌లు/వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి.
సోషల్ మీడియాలో కనిపించే అతిగా తక్కువ ధరల ఆఫర్లను నమ్మవద్దు.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అత్యవసరమని, జాగ్రత్తే భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.




