ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ.. బీసీలకు బంపర్ ఆఫర్

ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ.. బీసీలకు బంపర్ ఆఫర్
ఏపీలో కొత్త స్కీమ్‌పై మంత్రి గొట్టిపాటి ప్రకటన
అమరావతి/ సీమకిరణం న్యూస్ :
సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా, బీసీలకు ప్రత్యేక రాయితీలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తోందని గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దీనివల్ల పేదలకు విద్యుత్ చార్జీల భారం గణనీయంగా తగ్గనుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి పర్యటించారు. సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఆచరణలో సాధ్యమవుతోందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మాజీ సీఎం జగన్ పెంచిన ట్రూ అప్ చార్జీలను ట్రూ డౌన్ చేసే దిశగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మాత్రమే చూసిందని గొట్టిపాటి అన్నారు. విద్యుత్ రంగంపై చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో విద్యుత్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆదాయం సమకూరుస్తున్నారని తెలిపారు. 18 నెలల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అనతికాలంలోనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని చెప్పారు. పీఎం సూర్యఘర్, కుసుమ్, బ్యాటరీ స్టోరేజ్ విధానం, డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి పెంచుతూ తీసుకొచ్చిన సంస్కరణలతో చార్జీలు తగ్గించగలుగుతున్నామని వివరించారు.




