పొట్టి శ్రీరాములును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 15, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని వారి త్యాగం మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ తెలిపారు.. సోమవారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక పూల బజార్ లో వారి విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ , జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి, వర్ధంతిని అధికారంగా జరుపుకోవాలని ప్రకటించింది కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపన కొరకు అమరావతి లో 5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు.. నగరంలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. నేటి యువత పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడిచి రాష్ట్రానికి, దేశానికి తమ వంతు సేవ చేయాలన్నారు… ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న నిరాహారదీక్ష ప్రారంభించారని, ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనలో 1952 డిసెంబర్ 15న అసువులు బాసారని తెలిపారు. ఆంధ్రుల కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయం అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశారన్నారు.. ఆయన చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, రాష్ట్రాభివృద్ధికి అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, బీసీ సంక్షేమ అధికారి ప్రసున్న తదితరులు పాల్గొన్నారు.




