
మెడికల్ కాలేజీలు..కేంద్రానిదీ పీపీపీ విధానమే !?
అమరావతి/ సీమకిరణం న్యూస్:
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి మార్చడం అంటే ప్రైవేటీకరణ అంటూ రచ్చ చేస్తున్న వైసీపీకి గట్టి షాక్ తగులుగుతోంది. కోటి సంతకాల పేరుతో సొంత సంతకాలను గవర్నర్‌కు ఇచ్చేందుకు రెడీ అవుతున్న సమయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సంచలనాత్మక నివేదికను స్పీకర్ కు సమర్పించింది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్వహించడమే మంచిదని.. అలా నిర్వహించే సంస్థలకు పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇవ్వాలని స్థాయీ సంఘం సిఫారసు చేసింది.
*పీపీపీ విధానానికే నిపుణుల ఓటు*
మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో పార్లమెంటు స్థాయీ సంఘం వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోకి తీసుకురావాలని, ఇందుకు ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని సూచించింది. సమాజ్‌వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ నేతృత్వంలోని ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ స్థాయీ సంఘం డిసెంబర్ 12న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు ప్రధానంగా ఉన్నాయి.
వైద్య విద్య ఖర్చు రూ.60 లక్షల నుంచి రూ.1 కోటికి పైగా ఉండటంతో విద్యార్థులపై భారీ ఆర్థిక ఒత్తిడి పడుతోంది. దీంతో చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో చదివి వచ్చిన తర్వాత లైసెన్స్ పరీక్షలు, రిజిస్ట్రేషన్‌లో ఇబ్బండులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పీపీపీ మోడల్‌ను ప్రోత్సహించాలని సంఘం సిఫారసు చేసింది.
*పీపీపీ మోడల్ కు అడ్డంకులు తొలగించాలని సిఫారసు*
పీపీపీ మోడల్‌కు అడ్డంకులు తొలగించేందుకు సమగ్ర నిబంధనలు రూపొందించాలని, ప్రైవేట్ కాలేజీలు జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. సీట్ల పెంపు గురించి సంఘం మరిన్ని సిఫార్సులు చేసింది. కొత్త కాలేజీల్లో ఇప్పుడు 50, 100 లేదా 150 సీట్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని దశలవారీగా ఒక్కో కాలేజీలో 250 సీట్ల వరకు పెంచే అవకాశం కల్పించాలని సూచించింది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలన్న యూజీ-ఎంఎస్ఆర్ గైడ్‌లైన్స్-2023ను చేరుకోవాలంటే ఇప్పటికే ఉన్న సీట్లకు మరో 40 వేలు పెంచాలని సూచించారు.
*పీపీపీ వల్లే వైద్య విద్య ప్రమాణాలు మెరుగు*
పీపీపీ మోడల్ ద్వారా వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి, నాణ్యతను పెంచవచ్చని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెబుతోంది. ఈ సిఫార్సులు అమలైతే దేశ వైద్య విద్యా రంగం కొత్త దారిలోకి వెళ్తుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పీపీపీ మోడల్ లో కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.అయితే వైసీపీ డ్రామాలు ప్రారంభించింది. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ అనే తప్పుడు ప్రచారం చేస్తూ.. రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయానికి కేంద్ర చెక్ పెట్టబోతోంది.




