ఉపాధిలో సౌకర్యాలు కల్పించాలి :
ఎంపిపి హేమలత
చిప్పగిరి, మార్చి 26, (సీమకిరణం న్యూస్) :
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నందు పనులు చేసే కూలీలకు మౌలిక సౌకర్యాలు కల్పించాల ని మండల ఎంపిపి జూటూరు హేమలత అన్నారు. శనివారం మండల కేంద్రమైన చిప్పగిరి లోని ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జూటూరు హేమలత మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాలు తప్పక కల్పించాలని సిబ్బందికి తెలియజేశారు. ముఖ్యంగా వేసవి కాలం మండుటెండల్లో పనులు చేస్తున్న కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాలలో పనులు కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. గ్రామాలు వదిలి ఏ ఒక్కరూ వలస వెళ్ళవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఆమె తెలియజేశారు. అనంతరం మండల పరిధిలోని నేమకల్లు గ్రామమునందు చెత్త సంపద కేంద్రం నిర్మాణం కొరకు స్థలాన్ని పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం చెత్త సంపద కేంద్రం పనులను ప్రారంభించాలని ఆ గ్రామ సర్పంచ్ ప్రేమ్ కుమార్ కు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రాజు, చిప్పగిరి గ్రామ సర్పంచ్ దాసరి గోవిందరాజులు, నేమకల్లు ఎంపీటీసీ సభ్యులు సుంకన్న, పంచాయతీ కార్యదర్శి సురేంద్రనాథ్, వైసిపి నాయకులు జూటూరు మారయ్య, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.