ఎగువలో వైభవంగా ధ్వజారోహణం…
సింహవాహనంపై దర్శనమిచ్చిన జ్వాలా నరసింహుడు…
దిగువలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
ఆళ్లగడ్డ, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో బుధవారం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప రంగనాథ యతీoద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో జిపిఎ సంపత్, ఈఓ బి వి నర్సయ్య ల ఆధ్యర్యంలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు, బ్రహ్మోత్సవాల అర్చకులు లక్ష్మీనరసింహాచార్యులు, అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడు కొలువుతీరిన ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి ద్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కొలువు మండపంలో ఉంచి పూజలు నిర్వహించారు సాయంత్రం శ్రీ జ్వాలా నరసింహ స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఎదుట అర్చకులు భేరీ తాటను వాయిస్తూ బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం పలికారు. రాత్రి జ్వాలా నరసింహ స్వామి ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం సింహవాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు.
దిగువ అహోబిలంలో : దిగువ అహోబిలం లో బుధవారం సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేసారు. నిత్య ఉత్సవమూర్తి సుదర్శన మూర్తినీ విశ్వక్సేనుని ప్రత్యేకంగా అలంకరించారు ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు ఆలయానికి ఎదురుగా ఉన్న మండపం వద్ద ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పుట్ట మన్ను తీసుకొనివచ్చి పాలికలలో నింపి నవధాన్యాలను అందులో వేసి పూజలు నిర్వహించారు.