వైద్యులను అరెస్ట్ చేయడo తగదు
వైద్యులను అరెస్ట్ చేయడo తగదు
నంద్యాల, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
రాజస్థాన్ రాష్ట్రంలో దౌస జిల్లా లో మూడవ కాన్పు ప్రసవ సమ యంలో (22) మహిళ అధిక రక్తస్రావంతో వైద్య ప్రయత్నాలు ఫలించక మరణించినప్పుడు, వైద్యం చేసిన డాక్టర్ అర్చన శర్మపై ఐపిసి 302 సెక్షన్ కింద హత్యా నేరం మోపి అరెస్టు చేయడంతో, మనస్తాపం చెందిన డాక్టర్ అర్చన శర్మ వైద్యులపై దాడులు ఆపాలని వేడుకుంటూ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎమ్ఎ నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఐఎమ్ఎ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ రవికృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డా. విజయ భాస్కర రెడ్డి, నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ అనిల్, కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, మహిళా విభాగ బాధ్యులు డాక్టర్ నాగమణి , డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ సౌజన్యలు మాట్లాడారు. ఈ సంఘటనలో రాజస్థాన్ పోలీసుల దుశ్చర్యలను ఐ. ఎమ్.ఎ. తీవ్రంగా ఖండిస్తున్నది. సంబంధిత పోలీసు అధికారులను తక్షణం సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. వైద్యం చేయడంలో లోపాలు జరిగినా, రోగి మరణించినప్పుడు న్యాయ స్థానాల ద్వారా న్యాయం పొందడానికి, పరిహారం కోరడానికి అవకాశం ఉందని, అంతేకాని అటువంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యులపై, వైద్య సిబ్బందిపై భౌతిక దాడులు చేయడం సరైన విధానం కాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు వైద్యపరమైన లోపాలపై సుప్రీంకోర్టు తీర్పులు, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని, ఫిర్యాదు అందిన వెంటనే వైద్యులను అరెస్టు చేయడానికి వీల్లేదని ఐఎంఏ స్పష్టం చేసిందని, వైద్యపరమైన మరణాలపై హత్యారోపణలాంటి చట్టాలను వినియోగించరాదని గుర్తు చేశారు.