అట్టహాసంగా జగనన్న స్వచ్చ గ్రంథాలయ ప్రారంభోత్సవం
అట్టహాసంగా జగనన్న స్వచ్చ గ్రంథాలయ ప్రారంభోత్సవం
కర్నూలు టౌన్, మార్చి 30, (సీమకిరణం న్యూస్) :
స్థానిక అంబేద్కర్ సమీపంలోని ప్రధాన గ్రంథాలయంలో బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జగనన్న స్వచ్చ గ్రంథాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చేపట్టిన జగనన్న స్వచ్చ గ్రంథాలయం కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు నగర ప్రజలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతోనే నగర పాలక సంస్థ కూడా గార్బేజ్ పాయింట్లు తొలగించి, ఇంటింటికీ మరియు కమర్షియల్ షాపులకు డస్ట్ బిన్ లు అందజేసి, సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.నగర పాలక సంస్థ లక్ష్యానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.నగరంలో గ్రంథాలయాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాన్నింటిని పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు.నగర పాలక సంస్థ 50 సెంట్ల స్థలం కేటాయిస్తే దేశంలోనే ఆదర్శవంతమైన గ్రంథాలయాన్ని దాతల సహకారంతో కర్నూలు నగరంలో నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ ఎం.డి. రాజగోపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు చంద్రశేఖర్ కల్కూర, గంగధర్ రెడ్డి, వైకాపా నాయకులు ధనుంజయ ఆచారి, మద్దిలేటి, పులికొండన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.