టైలరింగ్ తోనే భవిష్యత్తు
కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్
కర్నూలు టౌన్, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
సృజనాత్మకతను వెలికితీస్తే టైలరింగ్ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. గురువారం నగరంలోని వడ్డెగేరిలో ఉన్న కే.వి.ఆర్ గార్డెన్స్లో హెల్పింగ్ హ్యాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీ ఆద్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి.జి భరత్ హాజరై మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 120 మంది మహిళలకు ఉచితంగా రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. తన తండ్రి టి.జి వెంకటేష్‌ను ఆదర్శంగా తీసుకొని మోయిన్ భాషా సేవ కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. సేవ చేయాలన్న తపన ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు. ఇక మహిళలు తాము నేర్చుకున్న టైలరింగ్‌లో విభిన్న రకాలుగా ఆలోచించి కొత్త కొత్త డిజైన్లు తయారుచేయాలన్నారు. నేటి సమాజంలో టైలరింగ్‌కు ఎంతో గుర్తింపు ఉందన్నారు. తమ టి.జి.బి యూత్ నుండి కూడా ఎలాంటి సహకారం కావాలన్నా ముందుండి అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా టైలరింగ్ శిక్షణా అనంతరం నిర్వహించిన పరీక్షలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి టిజి భరత్ ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ మోయిన్ భాషా, అడ్వకేట్ జహంగీర్, అబ్దుల్ రజాక్, గఫార్, మహబూబ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.