అర్చకులు,వేద పండితున్ని సన్మానించిన జిల్లా కలెక్టర్
అర్చకులు, వేద పండితున్ని సన్మానించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
శుభ కృత్ నామ సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయుచున్న ముగ్గురు అర్చకులు, ఒక వేద పండితున్ని శాస్త్రోక్తంగా శాలువతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందచేసామని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ముగ్గురు అర్చకులు, ఒక వేద పండితున్ని కలెక్టర్ సన్మానించారు. పాణ్యం మండలం కేంద్రంలోని శ్రీ వీర నారాయణ స్వామి దేవాలయంలో వేదపండితులుగా పనిచేయుచున్న కృష్ణ కుమార్ శర్మను కలెక్టర్ సన్మానించారు. అలాగే కాల్వబుగ్గ శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులుగా పనిచేయుచున్న లక్ష్మీ నారాయణ శర్మను, అవుకు మండలం శివవరం గ్రామంలోని శ్రీ సూర్యనారాయణ ఆంజనేయ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులుగా పనిచేయుచున్న మధుసూదనరావును, ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ కోట ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న విజయ భాస్కర శాస్త్రిలను సాంప్రదాయ రీతిలో కలెక్టర్ సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సన్మాన గ్రహీతలైన ఒక్కొక్కరికి రు.10,116/-లు సంభావన, శాలువ, మంచి నాణ్యత గల కాటన్ పంచె, కండువా తదితరాలతో కలెక్టర్ సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆది శేష నాయుడు పాల్గొన్నారు.