నంద్యాల జిల్లాగా ఏర్పాటు కావడం గర్వకారణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల జిల్లాగా ఏర్పాటు కావడం గర్వకారణం
ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :-
ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లే ప్రధాన ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. సోమవారం ఆర్ఏఆర్ఎస్, నంద్యాల జిల్లా కలెక్టరేట్ వి.సి హాలులో రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన జిల్లాల బృహత్తర కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఈషాక్ బాషా, చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తోగూర్ ఆర్తర్, బ్రిజేంద్రనాథరెడ్డి,మున్సిపల్ చైర్మన్ షేక్ మాబున్నీషా, వ్యవసాయ అడ్వైజరీ బోర్డు అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పి కె. రఘువీరారెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల గడప దగ్గరికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి పార్లమెంటు కేంద్ర పరిధిలో నూతన జిల్లాకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంతో చరిత్ర గల నంద్యాల ప్రాంతాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రాబోయే కాలానికి జిల్లా ప్రజలందరికీ మంచి జరుగుతుందని మంత్రి ఆకాంక్షించారు. జిల్లా ఏర్పాటు ప్రక్రియలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులందరికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. అలాగే జిల్లా ఎస్.పి కార్యాలయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. తదనంతరం నూతన నంద్యాల జిల్లా కలెక్టర్ గా డా. మనజిర్ జిలాని సమూన్, జిల్లా జాయింట్ కలెక్టర్ గా నారపురెడ్డి మౌర్య లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వెబ్ సైట్ ను జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన నంద్యాల జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి మరింత చేరువగా తీసుకెళ్లి మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు నంద్యాల జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు మరింత సేవలందించేందుకు కృషి చేద్దామన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కావడానికి కొంత సమయం పడుతుందని అయినప్పటికీ అధికారులందరూ కర్నూలు జిల్లాతో పోల్చుకోకుండా నంద్యాల జిల్లా అభివృద్ధికి శాయశక్తులా, అంకితభావంతో కృషి చేయాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను క్యాజువల్ గా తీసుకోకుండా సాధనలో నిమగ్నం అయితే అంత అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో పనులు అధికంగా ఉంటాయని చేపట్టిన పనుల్లో అలసత్వం లేకుండా బాధ్యతను అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ తెలిపారు. కిందిస్థాయి సిబ్బంది విధులు నిర్వహించడంలో నిర్లిప్తత లేకుండా పనులు పురమాయించి ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యథానిస్తున్న గృహ నిర్మాణాలు, స్పందన అర్జీల పరిష్కారంలో ఎలాంటి అశ్రద్ధ చూపకూడదని కలెక్టర్ తెలిపారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చే అవకాశముందని అధికారులు అందరూ కలిసి సమన్వయంతో విజయవంతం చేసేందుకు చాలెంజ్ గా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతి సంతృప్తికరంగా ఉందని అదేవిధంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులందరూ పరస్పరం భాగస్వామ్యంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.