ప్రజలకు మరింత చేరువ కావాలి :-
జిల్లాను అన్నింటిలో ప్రధమ స్థానంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయండి :-
ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి :-
ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాలలో త్రాగు నీటి సమస్య రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలి :-
సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను వంద శాతం సాధించాలి :-
జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :-
జిల్లా చిన్నదైంది..కొత్త ప్రయాణం.. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు మంచి అవకాశం.. ఆ దిశగా పని చేసి జిల్లాను అన్నింటిలో ప్రధమ స్థానంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మొదటిసారి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..1951లో కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారని….దాదాపు 70 సంవత్సరాల తర్వాత రూపురేఖలు మార్చుకుని కొత్త జిల్లాకు అడుగు పెట్టమని, కర్నూలు జిల్లా మూడు డివిజన్ లు 26 మండలాలతో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు అన్నారు. ఈ రోజు నుంచే కొత్త ప్రయాణం మొదలు పెట్టామని జిల్లా అధికారులు అందరూ బాధ్యతతో చిత్తశుద్ధితో జిల్లాను అన్నింటిలో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. నంద్యాల, కర్నూలు రెండు కలిసి ఉన్నప్పుడు దాదాపు ఒక ప్రాంతానికి వెళితే మూడున్నర గంటల సమయం పట్టేదని, ఇప్పుడు జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరాభారం తగ్గనుందని, జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావడానికి మంచి అవకాశం అన్నారు.. . ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎలా అమలు అవుతున్నాయి, అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలన్నారు.. అధికారులందరూ క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గతంలో కొన్ని ఏరియాల్లో వెళ్లడానికి అవకాశాలు ఉండేవి కావని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని బాధ్యతతో అధికారులందరూ సమీక్ష నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ రోజు నుంచి కొత్త ప్రయాణం మొదలు పెట్టామని, అధికారులందరూ ఆఫీసులకే అంకితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి, రేపటి నుంచి మంచి ఫలితాలు కనిపించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారుల కార్యాలయంలో మ్యాపులు తయారు చేసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ సూచించారు. డివిజన్ స్థాయిలో సమావేశాలు ప్రతి నెల జరుగుతాయని, వచ్చే రెండు మూడు నెలల్లో పురోగతి కనిపించాలన్నారు. సుస్థిర సమగ్రాభివృద్ది లక్ష్యాలను వంద శాతం సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 11వ తేదీ నుంచి సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధన పై వర్చువల్ విధానంలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. అంకితభావంతో కష్టపడి చేయకుండా ఇష్టంతో పని చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పాలన పై దశా, దిశా, నిర్దేశం మీ అనుభవాన్ని పంచుకొని సచివాలయ సిబ్బంది సేవలను బాగా వినియోగించుకొని జిల్లాలో అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన నుండి ఏమి ఆశిస్తోందో ఆ ఆశయాన్ని నెరవేర్చాడానికి కృషి చేద్దామన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలను తరచూ తనిఖీలు చేయాలని వివిధ సంక్షేమ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు వచ్చే ఉగాది వరకు చేయాల్సిన పనుల పై అధికారులందరూ ప్రణాళికలు తయారు చేసుకొని ఆ దిశగా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాలలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు ఆర్డబ్ల్యూఎస్, డిపిఓ, జెడ్పీ సీఈఓ అధికారులు అందరూ ప్రత్యేక ఫోకస్ పెట్టి మంచినీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి పురోగతి కనిపించేలా చర్యలు చేపట్టాలని హౌసింగ్ పిడి ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల పెండింగ్ పనులపై ప్రస్తుత పరిస్థితిని రిపోర్ట్ రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, కర్నూలు డిఆర్ఓ ఎస్వీ నాగేశ్వర రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.