జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలి :-
మొదల కానీ ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టండి :-
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) :-
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం గూడూరు మండలం, కే నాగలాపురం గ్రామ సమీపంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ లో జరుగుతున్న ఇంటి నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కే.నాగలాపురం జగనన్న హౌసింగ్ లేఔట్ లో 85 ఇళ్లు మంజూరు కాగా అందులో 77 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, ఇంకా 8 ఇళ్లు మొదలు పెట్టాల్సి ఉందని, వాటిని త్వరలో మొదలు పెట్టి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామని అధికారులు జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి గుంతలు తవ్విన వెంటనే 15 వేల రూపాయలు లబ్ధిదారులకు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని ఇళ్లు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు స్టేజీల వారిగా పూర్తయిన అనంతరం బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టే లబ్ధిదారులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. అందులో భాగంగా పునాదికి వినియోగించే రాయి ఎక్కడినుంచి తేప్పిస్తున్నారు, ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలను లబ్ధిదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అలాగే సకాలంలో హౌసింగ్ బిల్లులు పడుతున్నాయి లేదో లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకోక సకాలంలో బిల్లులు పడుతున్నాయని లబ్దిదారులు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, ఇసుక కొరత ఏమైనా ఉందా, ఉంటే తెలియజేయాలని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ సూచించగా తమకు ఇసుక సమస్య లేదని లబ్ధిదారులు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. ప్రతి రోజూ సాయంత్రానికి జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బిల్లులు విషయం పై తెలియజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చివరిదశకు వస్తే సిసి రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి కుళాయి, తదితర సౌకర్యాలు కల్పిస్తామని త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులను జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట గూడూరు తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్, రెవెన్యూ అధికారులు, స్థానిక సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.