
నేడు నంద్యాలకు సీఎం రాక :-
అన్ని ఏర్పాట్లు పూర్తి సర్వం సిద్ధం :-
ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, నంద్యాల ఎంపి, ఎమ్మెల్యేలు :-
లాంఛనంగా మూడవ విడత జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి :-
నంద్యాల ప్రతినిధి, ఏప్రిల్ 07, ( సీమకిరణం న్యూస్) :
నంద్యాల కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లాకు పర్యటనకు విచ్చేయనున్నారు. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభ, జగనన్న వసతి దీవెన పథక ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగనన్న వసతి దీవెన లబ్ధిపొందిన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖాముఖి కానున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, నంద్యాల జిల్లా ఎస్పి కె. రఘువీరారెడ్డి, యంపి పోచా బ్రహ్మానందరెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, తోగూర్ ఆర్థర్, ఉమ్మడి జిల్లాలో జెసి(ఆసరా)గా పనిచేసిన ఎం.కె.వి శ్రీనివాసులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేశారు. సీఎం రాక సందర్భంగా జిల్లా ఎస్పీ అధికార యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
భారీ ఫ్లెక్సీలు :-
రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బహిరంగ వేదికను పూలతో అందంగా ముస్తాబు చేశారు. హెలిప్యాడ్ నుంచి సీఎం సభ వేదికకు రోడ్డు మార్గంలో వచ్చే దారిలో..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా కర్నూల్ రేంజ్ డిఐజి,నంద్యాల, కర్నూలు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వివిధ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సీఎం పర్యటన ప్రాంతానికి అనుమతిస్తారు. బందోబస్తు చర్యల్లో భాగంగా గురువారం కర్నూలు, నంద్యాల ఎస్పీలు సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో బందోబస్తు చర్యలను పరిశీలించారు. బందోబస్తుపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేసారు.