వాలంటీర్లకు వందనం – పండగ వాతావరణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం
వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులు ప్రదానం
ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవావజ్ర అవార్డులు ప్రదానం
ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తూ ప్రజా సేవే పరమావధిగా సేవలందిస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లు – జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘం – కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య
కోవిడ్ సంక్షోభ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు నిరుపమానం – పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుంది..సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నా వలంటీర్లు – కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్) :
ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తూ ప్రజా సేవే పరమావధిగా సేవలందిస్తున్న మానవతా మూర్తులు వాలంటీర్లు అని వారి సేవలను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు కొనియాడారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేటలో వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం రూ.239.22 కోట్ల నగదు పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా పర్యవేక్షణ అనంతరం ఉత్తమ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానంతో పాటు సర్టిఫికెట్, బ్యాడ్జ్, దుశ్శాలువతో సన్మానం చేయడంతో పాటు సేవా రత్నకు సిల్వర్ మెడల్, సేవా వజ్రా కు గోల్డ్ మెడల్, నగదును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, నగర మేయర్ లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….పాలన పారదర్శకంగా ఉండాలి…ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు అందరికీ అందాలి, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలిసుండాలి…ఈ రెండింటి మధ్య వారధి కావాలి..సంధాన కర్తలు కావాలి ఆ ఏర్పాటు ఓ వ్యవస్థలా ఉండాలని, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు అది మనుగడ సాగించాలి, అదే గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అని, వాలంటీర్ల సేవలను గుర్తించి వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం చేస్తుందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా వేకువజామునే ఇంటి తలుపుతట్టి మరీ లబ్ధిదారులకు పింఛన్‌ను అందిస్తున్నారు వాలంటీర్లు అన్నారు. అదొక్కటే కాదు జనన, మరణ ధ్రువీకరణ పత్రం మొదలు ఇంటి పట్టాల పంపిణీ, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీకార్డుల జారీ వంటి సుమారు 545 సర్వీసులనూ ప్రతి గడపకు చేరవేస్తున్నారన్నారు. తనకు కేటాయించిన 50 ఇళ్లలో ఒక వృద్ధురాలకు పెన్షన్ ఇవ్వడం, కదలలేని మంచానికి పరిమితమైన వారికి ఇంటి దగ్గరికి వెళ్లి రేషన్ అందజేయడం, వారి బాధలను చేదోడువాదోడుగా ఉంటూ కష్టాలు వస్తే ఇంటిలో వారు ఎవరూ పట్టించుకోకపోయినా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళని వారి సేవల గురించి జిల్లా కలెక్టర్ కొనియాడారు. గతంలో ఏదైనా పట్టా పాస్ బుక్, రేషన్ కార్డ్ తదితర వాటి కోసం మండల కేంద్రానికి వెళ్లి అధికారులు ఫీల్డ్ కు వెళ్లితే ఇబ్బందులు పడి మరుసటిరోజు కూడా వెళ్లే వాళ్ళని, ఈ బాధలన్నీ ప్రభుత్వం గమనించి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందని అన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సత్కరించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘం –
కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య పేర్కొన్నారు. పండగ వాతావరణంలో వాలంటీర్ల సేవలను గుర్తించి వారిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మిమ్మల్ని ఎంతో నమ్మి రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకంతో ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థని తీసుకు వచ్చారన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వాలంటీర్లు వాగు వచ్చినా, వరద వచ్చినా, సెలవు అయినా తలుపు తట్టి గడప తొక్కి వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ అందిస్తుంటే వారి ముఖాల్లో ఆనందం చూస్తే వెల్లివిరుస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా…కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా….ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే వాలంటీర్లు అందిస్తున్నారన్నారు. 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను విని కళ్ళారా చూసి జగనన్న వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని వాలంటీర్ల ద్వారా చేయిస్తున్నారన్నారు. కర్నూలు కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడుస్తోంది అంటే మిమ్మల్ని కూడా అభినందించాల్సిన అవసరం చాలా ఉందన్నారు. మరింత సౌలభ్యం, ప్రజలకు సర్వీసు దగ్గర చేయడం కోసం 13 జిల్లాలతో పాటు కొత్తగా 13 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు. ఇలా అన్నీ చేస్తున్న ఏమిచ్చినా సీఎం గారి రుణం తీర్చుకోలేం అన్నారు. కార్పొరేషన్లో ప్రజలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సహకారంతో చెత్తను తొలగించగలమన్నారు. మీరందరూ కూడా కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కోవిడ్ లాంటి సమయంలో బంధువులు భయపడి సేవ చేయడానికి ముందుకు రాని పక్షంలో కూడా వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి తమ సేవలు అందించారన్నారు. కర్నూలు కార్పొరేషన్ కు సంబంధించి పరిశుభ్రతలో జాతీయ ర్యాంకును 70 కి తీసుకొచ్చామని, రాబోయే రోజులలో సింగల్ డిజిట్ ర్యాంక్ కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు నిరుపమానం –
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
కోవిడ్ సంక్షోభ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు నిరుపమానమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల కోసం కష్టపడి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా గడప వద్దకు అందించిన వాలంటీర్లను పురస్కారాలతో పాటు సత్కరించుకోవడం జరుగుతోందన్నారు. సేవా మిత్ర, సేవ రత్న, సేవా వజ్ర ఎవరికైతే రాలేదో మిగిలిన వారందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి ప్రోత్సాహకాలు అందుకోవాలని వాలంటీర్లకు పాణ్యం ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. జిల్లాలో 17వేల 197 మంది వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో 1864 మంది వాలంటీర్లకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామన్నారు. తాము ఎమ్మెల్యేగా ఎవరికైనా పింఛన్ ఇప్పించాలన్న కూడా వాలంటీర్ల దగ్గరికి రెఫర్ చేసి అర్హులై ఉంటే మీ ద్వారా వారికి పెన్షన్ అందేలా చూస్తున్నామన్నారు. పేదవారికి అన్యాయం జరగకూడదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్ వ్యవస్థ తీసుకు వచ్చారన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుంది…సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నా వలంటీర్లు –
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుంది..సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తరలించడంతో పాటు ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందులు, కూరగాయలు, నిత్యావసర సరకులు సరఫరా చేశారని, వైరస్‌తో పోరాడి చనిపోయిన వ్యక్తులనూ మోసి చివరి మజిలీకి చేర్చారన్నారు. కష్టకాలంలో కనిపించిన వాళ్లే ఆప్తులు.. ఆత్మీయులు..వాళ్లే రాష్ట్ర ప్రభుత్వం పంపిన వాలంటీర్లు అన్నారు. సమాజానికి ఏదో మేలు చేయాలని వాలంటీర్లు వచ్చారన్నారు. గతంలో రేషన్ కార్డు తెచ్చుకోవాలన్న ఇబ్బందులు పడే వాళ్లమని, అప్పట్లో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉండేదని, చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కూడా పనులు జరిగేవి కావని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఆ సమస్యలన్నీ జగనన్న గుర్తించి వాలంటీర్ వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. 50 నుంచి 100 కుటుంబాల తలరాత మార్చాలని దృఢంగా నమ్మి వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. లక్షా 30 వేల కోట్ల రూపాయలు వాలంటీర్లు ద్వారా పేద వర్గానికి సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వగలిగమన్నారు. పేదలకు తోడుగా మానవసేవే మాధవ సేవ కాబట్టి మీ సేవలను ఇంకా బాగా సేవలందించాలని వాలంటీర్లుకు ఎమ్మెల్యే సూచించారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ…కర్నూలు జిల్లాలో సేవా మిత్ర 16803, సేవా రత్న 324, సేవా వజ్ర 70 మందికి, మొత్తం 17197 మందికి 17 కోట్ల 66 లక్షల రూపాయలు పురస్కారాల రూపంలో అందిస్తున్నామన్నారు. ఆలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సేవా మిత్ర 1838, సేవ రత్న 19, సేవ వజ్ర 7 మందికి, మొత్తం 1864 మందికి రూ.189.70 లక్షలు అందజేశామని, ఈ సందర్భంగా వాలంటీర్లు అందించిన సేవలు గురించి వారు కొనియాడారు.
స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నుంచి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ, కార్పొరేటర్లు, అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా అధికారులు, తదితరులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.