
– విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
– పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువు
– 2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత జగనన్న వసతి దీవెన
– నంద్యాల బహిరంగ సభలో సిఎం జగన్
కర్నూలు కలెక్టరేట్, నంద్యాల ,ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ మీ ముందుకు వచ్చానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తొలిసారిగా నంద్యాల జిల్లా ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి నంద్యాలకు చేరుకొని పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్ లోని బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన పథకం కింద రెండో విడతలో 10, 68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.1,024 కోట్ల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. అంతకుముందు దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం వైయస్ జగన్ మాట్లాడుతూ పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశామని, అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామని తెలిపారు. ఏ ఒక్క పాప గాని, బాబు గాని ప్రాథమిక, ఉన్నత విధ్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదని, ఏ ఒక్క తల్లిదండ్రి అప్పుల పాలు కాకూడదన్నారు. చదువు అనే అస్తి పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకురావని, సమూలంగా విద్యారంగాన్ని మార్చే దిశగా అడుగులు వేశామన్నారు. నంద్యాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10,68,150 మంది పిల్లలకు మంచి జరిగేలా 9,61,140 తల్లుల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి 2021–2022 ఏడాదికి రెండో విడతగా రూ.1024 కోట్లు జమ చేస్తున్నానన్నారు. విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని, చిన్న పిల్లలు చదివే స్కూళ్ల రూపురేఖలు మారాయన్నారు. ఆ పిల్లలకు మంచి ఆహారంఅందిస్తున్నామని, జగనన్న గోరు ముద్ద పేరుతో మంచి భోజనం అందిస్తున్నానని పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమంతో బడుల రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు. ఈ రోజు బైలివింగ్ టెస్ట్‌బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చామని, స్కూళ్లన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామని, ప్రభుత్వ బడికి మళ్లీ మంచి రోజులు తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని, స్వాతంత్రం తరువాత మనకు 11 కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. నంద్యాల పట్టణంలో కొత్త మెడికల్ కాలేజీ వస్తుందని, స్కీల్ డెవలప్‌మెంట్ కాలేజీ వస్తోందని, మైక్రోసాప్ట్ సర్టిఫికెట్ కూడా కాలేజీలకు అనుసంధానం చేశామని, జాబ్ ఓరియేంటేడ్‌గా మార్చుతున్నామని, కాలేజీల్లో చదువుతున్న కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ విధానం తీసుకువస్తామని, డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను బడికి పంపించే 1 నుంచి 12వ తరగతి వరకు ఆ తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామని, ప్రతి ఏటా రూ.15 వేలు చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మల కోసం ఒక్క అమ్మ ఒడి మాత్రమే కాదని, వారికి తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్ ఆసరా, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు, సున్నా వడ్డీ రుణాలు, ఆర్థిక సాధికారత కోసం కార్పొరేట్ సంస్థలతో ఈ రోజు ఒప్పందాలు చేసి బ్యాంకులతో టైఅప్‌లు ఇచ్చామన్నారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జడ్పి ఛైర్మన్ ఎర్రపోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథ రెడ్డి, ఇషాక్ భాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బిజేంద్రరెడ్డి, తోగూర్ ఆర్థర్, కె.శ్రీదేవి, నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ కె. రఘువీరారెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ చైర్మన్ మాబున్నీషా, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, పట్టణ కౌన్సిలర్లు, పొడుపు సంఘాల సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.