మోడల్ ఆటోనర్ గా తీర్చి దిద్దేందుకు సహకారం అందిస్తా
– అడిగిన వెంటనే పనులు మంజూరు చేసిన సిఎం
కర్నూలు కలెక్టరేట్, నంద్యాల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
నంద్యాలను జిల్లాగా ప్రకటించిన సిఎం జగన్ కు ధన్యవాదాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పర్యటనకు వచ్చిన సిఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ 2017 ఉప ఎన్నికల్లో నంద్యాల ఎస్పీజీ మైదానం నుండే నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని మాట ఇచ్చి నెరవేర్చినందుకు నంద్యాల జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. నంద్యాల గడ్డలో అపార ఖనిజ సంపద, అటవీ సంపదతో పాటు అనేక పరిశ్రమలు వున్నాయని, ప్రధాని, రాష్టప్రతిలు ఇక్కడి నుండే ఎన్నుకోబడ్డారని, జిల్లా కావాలని ఎన్ని మార్లు అడిగినా ప్రజల కలగానే మిగిలిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చాక నంద్యాలను జిల్లాగా ప్రకటించి నంద్యాల జిల్లా ప్రజల కలను నిజం చేయడం సంతోషకరం అన్నారు. నంద్యాల పట్టణంలో 477 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఉత్తర్వులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నంద్యాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారని కుందు నది వెడల్పు కోసం నిధులు మంజూరు చేశారన్నారు. రహదారి విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు 26 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని మన ప్రభుత్వంలో ఇచ్చామన్నారు ఆటోనగర్ లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వడంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారన్నారు. నంద్యాల చుట్టుప్రక్కల రెండు జాతీయ రహదారులను కలుపుతూ 12 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఆటోనగర్ ను అభివృద్ది పరచి మోడల్ ఆటోనర్ గా తీర్చి దిద్దేందుకు సహకారం అందించాలన్నారు. వైయస్ అర్ నగర్ లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే మిర్చి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు వైఎస్ఆర్ నగర్ లో ఇళ్ల ఇళ్ల పట్టాలు మంజూరు తోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. సిఎం జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవి అడిగిన పనులన్నీ పూర్తి చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. అనంతరం శిల్పా రవి దంపతులు సిఎం జగన్ ను ఘనంగా సన్మానించారు.