ఆకట్టుకున్న విద్యార్ధినుల ప్రసంగం
కర్నూలు కలెక్టరేట్, నంద్యాల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లాలో శుక్రవారం నిర్విహించిన జగనన్న వసతి దీవెన సభకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ సభలో సిఎం జగన్ ప్రసంగం కంటే ముందు ఇద్దరు విద్యార్ధినుల ప్రసంగం సభలో ఉన్న జగన్ తో పాటు పలువురిని ఆకట్టుకుంది. నంద్యాలకు చెందిన విద్యార్థిని కరణం బృహతి మానస మాట్లాడుతూ తాను రామకృష్ణ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని, జగనన్న అందిస్తున్న వసతి దీవెన పథకం కింద ఏడాదికి రూ.20 ఇవ్వడం తన లాంటి మధ్య తరగతికి చెందిన కుటుంబాల అమ్మాయిలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా విద్యా దీవెనను ప్రవేశపెట్టినందుకు సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపింది. వసతి దీవెన పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చదువుతున్నారని పేర్కొంది. ప్రభుత్వం అందించే రూ. 20వేల ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు, హాస్టల్స్ చార్జీలు, పౌషికాహారం అందుతోందని సంతోషం వ్యక్తం చేసింది. అమ్మఒడి పథకం వల్ల తన తమ్ముడు శ్రీరామ చంద్ర బడిలో మంచిగా చదువుకుంటున్నాడని తెలిపింది. జగనన్న వల్ల తాను బాగా చదువుకుని లాయర్ అయ్యి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొంది. మరో బీటెక్ విద్యార్ధిని సౌమ్యశ్రీ మాట్లాడుతూ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, నవరత్నాల పథకాలు చాలా చక్కగా అమలు చేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలని, నా సీనియర్లు దాదాపు 70 శాతం మంది ఈ స్కీమ్ వల్ల బాగా చదువుకుని మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందారని, విప్రొ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలలో ఉద్యోగాలు పొందారన్నారు. నా సోదరుడు ఎంటెక్ చేస్తున్నారంటే కారణం అతని బీటెక్ అంతా కూడా ఫీజు రీఇంబర్స్‌మెంట్ ద్వారానే పూర్తయిందని, మా కుటుంబం ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందిందని, దిశ యాప్ చాలా బావుందని, మహిళలంతా కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుందని, ధ్యాంక్యూ సీఎం సార్ అంటూ ముగించారు.