సిద్దేశ్వరం జలదీక్షను విజయవంతం చేయండి
– : రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల టౌన్, ఏప్రిల్ 11, (సీమకిరణం న్యూస్) :
రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్దేశ్వరం అలుగును వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 6వ వార్షికోత్సవాన్ని పరస్కరించుకుని సోమవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నందు జరిగిన సమావేశంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ నిత్యం కరువుతో సహజీవనం చేస్తున్న రాయలసీమ ప్రజానీకం తమ త్రాగు, సాగు నీటి హక్కుల కోసం 2016 మే 31న వేలాదిమంది తరలిరాగా సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన చేపట్టి ప్రభుత్వానికి రాయలసీమ ప్రజల గుండెచప్పుడును వినిపించామన్నారు. రాజకీయ పార్టీలు కేవలం మాటలతో, వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపరచకుండా వేలాదిమంది ప్రజల ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన సిద్దశ్వరం అలుగు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి రాయలసీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. నంద్యాల-కల్వకుర్తి జాతీయ రహదారిలో భాగంగా సిద్దేశ్వరం దగ్గర నిర్మించనున్న వంతెనతో పాటు అలుగును కూడా నిర్మించి సీమ వాసుల త్రాగు, సాగునీటి కష్టాలను తొలగించాలని కోరారు. ఇండియన్ ఇరిగేషన్ కమీషన్, బచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు రాయలసీమ ప్రాజెక్టులకు చట్డబద్ద నీటిని వినియోగించుకోవడానికి క్యారీ ఓవర్ రిజర్వాయర్ల నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. సిద్దేశ్వరం దగ్గర మే 31న జరిగే జలదీక్ష కార్యక్రమానికి తమ తమ గ్రామాల నుండి స్వచ్చందంగా ట్రాక్టర్లతో తరలి రావాలని దశరథరామిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిద్దేశ్వర జలదీక్షకు సంబంధించిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, మనోజ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, భాస్కర్ రెడ్డి, సౌదాగర్ ఖాసీంమియా, నాగేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.