
ఆకస్మికంగా వార్డు సచివాలయాలు తనిఖీ :-
ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా పనిచేయండి :-
ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి :-
సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించండి :-
వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్):-
ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా వార్డు సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం కర్నూలు నగరంలోని బుధవార పేట కిందగేరి వార్డు సచివాలయం 1 మరియు 2 వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబంధించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లు పంపిణీ చేయకపోవడంతో జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి స్థానిక కార్పొరేటర్ చేతుల మీదగా లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయించాలని వార్డు సచివాలయ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కిందగేరి వార్డు సచివాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త బుట్టలను పంపిణీ చేయకుండా నిల్వ ఉంచుకోవడంతో సచివాలయ సిబ్బంది పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. పౌర సేవలను మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.