ప్లాస్టిక్ బియ్యం కాదు.. ఫార్టిఫైడ్ బియ్యం
ఫార్టిఫైడ్ బియ్యం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బలవర్ధకమైన బియ్యం
ప్రజలు ఎటువంటి అపోహపడవద్దు..
ఈ బలవర్ధకమైన బియ్యాన్ని ఉపయోగించుకోవాలి
జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి విజ్ఞప్తి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
కార్డు దారులకు పంపిణీ చేస్తున్న ఫార్టిఫైడ్ బియ్యం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బలవర్ధకమైన బియ్యం అని, ఇవి ప్లాస్టిక్ బియ్యం కాదని, ప్రజలు ఎటువంటి అపోహపడకుండా ఈ బలవర్ధకమైన ఫార్టిఫైడ్ బియ్యాన్ని ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల 2022 నుండి ఎంపిక చేసిన ఐదు జిల్లాలలో (కర్నూలు కూడా ఇందులో ఉన్నది) బలవర్ధకమైన (ఫార్టిఫైడ్) బియ్యం పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ మేరకు వీటిని పంపిణీ చేయడం జరుగుతోందన్నారు .. ఈ విషయం వివిధ దినపత్రికలలో కూడా ప్రచురితమయిందన్నారు.. ఈ బియ్యంలో అక్కడక్కడా తెల్లగా కన్పిస్తున్న బియ్యం గింజలు చూసి ప్రజలు ప్లాస్టిక్ బియ్యము అని అపోహ పడుతున్నట్లు పలు దినపత్రికల్లో వార్తలు ప్రచురితం అవుతున్నాయన్నారు . కానీ ఇవి ప్లాస్టిక్ బియ్యం కాదన్నారు .ఈ ఫార్టిఫైడ్ బియ్యం లో రక్తహీనత నివారించుట కొరకు ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్-బి.12 మొదలైన పోషకాలు కలిగి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బలవర్ధకమైన బియ్యం అని జాయింట్ కలెక్టర్ తెలిపారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా ప్రజలు అపోహలకు గురి కాకుండా ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఇకనుండి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఫార్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయన్నారు. ఈ బియ్యాన్ని వండేటప్పుడు కొద్దిగా నీరు తగ్గించి వండితే అన్నం బాగా ఉంటుందని, 2-3 పర్యాయాలు వండితే నీళ్ళు (ఎసరు) ఎన్ని వేయాలో తెలిసిపోతుందని జాయింట్ కలెక్టర్ వివరించారు . ప్రజలు అపోహ పడకుండా ఈ బలవర్ధకమైన బియ్యాన్ని ఉపయోగించుకోవాలని, ప్లాస్టిక్ బియ్యం అని ప్రచారం చేస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని సంబంధిత కార్డుదారులను, వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు