★ ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు :-
★ నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, కర్నూలు ఎంపీ, నగర మేయర్, కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు :-
★ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శం – జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
★ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ :-
★ అందరి సహకారంతో కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తా – కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య :
★ పేదల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేద్కర్ – పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-
★ అణగారిన వర్గాల ఆశా కిరణం అంబేద్కర్ – కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :-
అట్టడుగు వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు. గురువారం భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి మహోత్సవం పురస్కరించుకొని కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, డివిఎంసి మెంబర్లు, వివిధ సంఘాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై జయంతోత్సవం కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన గావించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. అంబేద్కర్ మార్గం అనుసరణీయమని అన్నారు. భారత దేశ రాజ్యాంగ నిర్మాణం కోసం అవిరళ కృషి చేసిన బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చే దిశలో పయనించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆంబేద్కర్ అన్నారు. నేటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. దేశ భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, వాటి పరిష్కర మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచిన దార్శనికుడని కొనియాడారు.
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ :-
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి భారతీయులందరికీ పండగ రోజు అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. నేటి విద్యార్థులు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని, ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన మహానీయులు అంబేద్కర్ అన్నారు. సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ పాటించాలని వారు కోరారు. మహాత్మ జ్యోతిబా పూలేను అంబేద్కర్ గురువుగా భావించి ఆయన ఆదర్శంగా తీసుకున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోయిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పార్కు ఏర్పాటుకు 5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయింపుకు కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీలలో ఎన్నో పార్కులు ఉన్నాయని, ఏదో ఒక పార్కులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మా గాంధీ లాంటి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని, అలాగే ఏదో ఒక పార్కుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని జిల్లా కలెక్టర్ ను కర్నూలు ఎంపీ కోరారు. తాను ట్రస్ట్ నెలకొల్పి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, కర్నూలు పార్లమెంట్ పరిధిలో కులమతాలకతీతంగా ప్రతి సంవత్సరం 10 మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి, సెలెక్ట్ చేసి సొంత ఖర్చులతో భారతదేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఐఎఎస్, ఐపిఎస్ కోచింగ్ ఇప్పిస్తానని, తాను ఎంత ఖర్చయినా భరిస్తానని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభాముఖంగా వారు తెలియజేశారు.
అందరి సహకారంతో కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తా – కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య :-
అందరి సహకారంతో కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తానని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య అన్నారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి వేడుకలను దేశమంతా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. యావత్ బడుగు, బలహీన వర్గాల వారికి అంబేద్కర్ జయంతి ఒక పండగ వాతావరణం లాంటిదన్నారు. నేటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందని, ఇతర దేశాలు కూడా మన రాజ్యాంగం చూసి అనుసరిస్తున్నాయి అన్నారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యంగ ఫలాలు అందరికీ అందేలా కృషి చేసిన మహనీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి అన్నారు. విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా అట్టడుగు వర్గాల వారికి ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మంత్రుల క్యాబినెట్ లో 70 శాతం అణగారిన వర్గాలకు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉందన్నారు. కేవలం సంక్షేమం లక్ష 33 వేల కోట్ల రూపాయలను పారదర్శకంగా పేద వర్గాల వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చూశారన్నారు. దేవుని ఆశీస్సులతో జగన్ మోహన్ రెడ్డి ద్వారా నేరుగా సేవ చేసే అవకాశం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజలందరూ సహకారంతో కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
పేదల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి అంబేద్కర్ – పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి :-
పేదల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొనియాడారు. ఆయన నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. ఏం చేయాలనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంకల్పించారో ఆ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రుల క్యాబినెట్ లో 70 శాతం అణగారిన వర్గాలకు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉందన్నారు.
అణగారిన వర్గాల ఆశా కిరణం అంబేద్కర్ – కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ :-
పేద, బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే సమయంలో అట్టడుగు వర్గాల సమస్యలు పరిష్కరించి వారిని అభివద్ధి బాటలో నిలిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. అంబేద్కర్ జయంతి బడుగు, బలహీన వర్గాల వారికి పండగరోజు అన్నారు. భారతదేశం రాజ్యాంగం లాగా ఉండాలని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి ఫలితం, బలిదానం, శ్రమ వలనే సమాజంలో సమాన హక్కులు వచ్చాయన్నారు. అధికారులను ప్రేమించి, ఒప్పించి వివిధ సంఘాల నాయకులు తమ జాతి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ డిఓ హరి ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్య నారాయణ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ మేయర్ బంగి అనంతయ్య, డివిఎంసి మెంబర్స్ సాయి ప్రదీప్, సత్తి రాజశేఖర్, ఉట్ల రమేష్ బాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.