రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ :-
వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి :-
ర్యాలీలో దారిపొడవునా ప్రజలకు అభివాదం చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి :-
బిర్లా గేట్ వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కర్నూలు ఎంపీ, కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ లకు క్రేన్ తో గజమాలతో సత్కరించిన జిల్లా వాసులు :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :
రెండవసారి మంత్రి పదవి చేపట్టి తొలిసారిగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గుమ్మనూరు జయరాంకు జిల్లా సరిహద్దు టోల్ ప్లాజా దగ్గర కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి జిల్లాకు ఘన స్వాగతం పలికారు. టోల్ ప్లాజా నుంచి వెంకటరమణ కాలనీ మీదుగా రాజ్ విహార్, గౌరీ గోపాల్, బిర్లా గేట్ వరకు ర్యాలీ కొనసాగగా ఈ ర్యాలీలో పెద్దఎత్తున బాణసంచా పేలుస్తూ జిల్లా వాసులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా దారిపొడవునా ప్రజలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అభివాదం చేశారు. గౌరీ గోపాల్ దగ్గర ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
ర్యాలీగా బిర్లా గేట్ చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నగర మేయర్ బి.వైరామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లకు క్రేన్ తో గజమాలతో జిల్లా వాసులు సత్కరించారు. ఈ ర్యాలీలో ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున యువకులు, జిల్లా వాసులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పట్ల ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.