రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 15, (సీమకిరణం న్యూస్) :
ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పై జిల్లా అధికారులు, పోలీస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ గారు అయిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి కుమారుని వివాహం సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి కర్నూలు నగరంలోని కృష్ణానగర్ లోని పత్తికొండ ఎమ్మెల్యే గారి నివాసానికి వస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హెలిపాడ్ వద్ద నుంచి బళ్లారి చౌరస్తా, కృష్ణానగర్ లోని ఉన్న పత్తికొండ ఎమ్మెల్యే నివాస గృహానికి వెళ్లే మార్గంలో బారికేడ్ల పనులను పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఎస్‌ఇని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటేషన్ చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజను ఆదేశించారు. సీఎం కాన్వాయ్ వాహనాలను ఏర్పాటు చేయాలని డీటీసీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మూడు చోట్ల అగ్నిమాపక వాహనాలను సమకూర్చాలని అగ్నిమాపక శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సూచించారు. భద్రతా ఏర్పాట్లు,, ప్రోటోకాల్, సేఫ్ రూమ్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం కల్పన తదితర అన్ని రకాల ఏర్పాట్ల ను ప్రోటోకాల్ ప్రకారం సక్రమంగా చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కదా ఎటువంటి తప్పులు దొర్లకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ నూరల్ ఖమర్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, డీఆర్‌ఓ ఎస్వీ నాగేశ్వర రావు, జిల్లా అధికారులు,పాల్గొన్నారు.