అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు……
జిల్లా ఎస్పి సుధీర్ కుమార్ రెడ్డి..
హోళగుంద, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన హోళగుందలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర లో అపశృతి చోటు చేసుకుని ఇరువర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల విసరు పోవడంతో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి శనివారం అర్ధరాత్రి హొళగుందకు చేరుకొని ఆదివారం కూడా హోళగుంద లో మకాం వేసి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్ర లో చిన్నపాటి ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగినది వాస్తవమని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 3 కేసులు నమోదు చేసి ఇరు వర్గాలకు సంబంధించి సుమారు 80 మంది వరకు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా హోళగుంద నందు సుమారు 400 మందితో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.