లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వ అధికారుల నుంచి అన్యాయం జరిగితే లోకాయుక్త సంస్థను ఆశ్రయించండి
పౌరునికి ప్రభుత్వ అధికారి వలన ఏదైనా నష్టం, అన్యాయం జరిగితే లోకాయుక్త కు ఫిర్యాదు చేయవచ్చు
సోమవారం నుంచి కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ లో ఉన్న లోక యుక్త సంస్థ కార్యాలయం నుంచి కార్యకలాపాలు
పత్రికల్లో వచ్చిన పెద్ద పెద్ద స్కామ్ లపై సుమోటోగా తీసుకుంటాం
అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పక్షంలో లోకాయుక్త సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు
పాత్రికేయుల సమావేశంలో పిలుపునిచ్చిన లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సంతోష్ నగర్ లో లోకాయుక్త సంస్థ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ….ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త సంస్థను హైదరాబాద్ నుంచి పూర్తిగా కార్యాలయ సిబ్బందిని కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగిందని, సోమవారం నుంచి అన్ని ప్రొసీడింగ్స్ ఇక్కడి నుంచి జరుగుతాయన్నారు. ఇక హైదరాబాదులో లోకాయుక్త సంస్థ కార్యకలాపాలు జరగవని, స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చే చేశారని, ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని పాత్రికేయులను వారు కోరారు. ప్రభుత్వానికి పౌరుడికి మధ్య మంచి సంబంధాలు ఉండేలా, ప్రజలకు ప్రభుత్వం మంచి పరిపాలన అందించేలా చూడాల్సిన బాధ్యత లోకాయుక్త సంస్థ మీద ఉందన్నారు. ముఖ్యంగా ప్రజలు వారి యొక్క హక్కులు గురించి సామాన్యులకు తెలియదన్నారు . ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి అన్యాయం జరిగితే లోకాయుక్త ను ఆశ్రయించవచ్చు విషయం చాలామంది తెలియదన్నారు.
1983లో లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతున్నా లోకాయుక్త, లోక్ అదాలత్ గురించి చాలామందికి తెలియడం లేదన్నారు. ఎందుకంటే నిరక్షరాస్యత ఎక్కువ ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుందన్నారు. ఈ విషయంపై ఎక్కువ ప్రచారం చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉందన్నారు. ప్రభుత్వ అధికారి ద్వారా ఒక పౌరుడు నష్టపోతే అప్పుడు అతని మీద ఫిర్యాదు చేయడానికి లోకాయుక్తను ఆశ్రయిస్తే ఫిర్యాదు తీసుకొని విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి కోర్టు ఫీజులు ఉండవని, 150 రూపాయలతో లోకాయుక్త సంస్థ పేరిట చలానా కట్టి ఫిర్యాదుతో పాటు పంపిస్తే దాని మీద విచారణ చేయడం జరుగుతుందన్నారు. పెద్ద పెద్ద స్కామ్ లపై పత్రికలో వచ్చిన వార్తలను కూడా సుమోటో గా తీసుకుంటామని, అలా తీసుకునే వెసులుబాటు లోకాయుక్త సంస్థ చట్టంలో కల్పించారన్నారు. రూమర్స్ విని రాయకుండా… వాస్తవాలు, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం మాదిరి కొంత సమాచారం సేకరించి…లోకాయుక్తకు సమాచారమిస్తే, ఫిర్యాదుదారుడు పేరును కూడా గోప్యంగా ఉంచి విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువగా లోకాయుక్త సంస్థకు రెవెన్యూ మీద ఫిర్యాదులు అందుతున్నాయని, అందులో ఆన్లైన్, వన్ బి, పట్టా పాస్ బుక్, మ్యూటేషన్ లమీద రైతుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. పౌరునికి ప్రభుత్వ అధికారి వలన ఏదైనా నష్టం, అన్యాయం జరిగిన పరిష్కరించే బాధ్యత లోకాయుక్త సంస్థ తీసుకొని, నేరం చేసిన అధికారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్యపై ఒక అప్లికేషన్ సంబంధిత అధికారికి అందజేసి నెలరోజుల్లోగా న్యాయం చేయకపోతే తదుపరి లోకాయుక్త సంస్థకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏ అధికారి అయిన తాను చేయవలసిన డ్యూటీ చెయ్యకుండా నిర్లక్ష్యం వహించిన అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రెకమెండ్ చేయడం జరుగుతుందన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని పక్షంలో కూడా లోకాయుక్త సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగితే కూడా లోకాయుక్త విచారణ చేయడం జరుగుతుందన్నారు. వాటర్ బాడీస్ సంబంధించి చెరువులు, కుంటలలో పట్టాలు, రస్తాలు ఇవ్వకూడదు అన్నారు. వాటిని తూచా అమలయ్యేలా లోకాయుక్త సంస్థ చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
పాత్రికేయుల సమావేశంలో రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త సంస్థ ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.