సంబరాన్నటిన వసంతోత్సవం

సంబరాన్నటిన వసంతోత్సవం
–కన్నుల పండువగా పార్వతీ
పరమేశ్వరుల కల్యాణోత్సవం
–ముగిసిన సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలు
ఆస్పరి, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని చిన్నహోతురు గ్రామంలో కొలిచేవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం వసంతోత్సవం సంబరాలు అంబరాన్నంటింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నులపండువగా జరిగింది. పెళ్లి కుమార్తె పార్వతీదేవిని పరమేశ్వరుడికి అప్పగించే కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు నిర్వహించడం విశేషం. పార్వతి దేవి అలిగి వెళ్లగా బుజ్జగించి తీసుకురావడానికి వెళ్లిన వారి పైన దేవి వర్గీయులు ఉండ్రాళ్ళను విసిరారు. వారిపై నీరు చెల్లి శాంతింపజేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
తన్నుల కోసం ఎగబడ్డ భక్తులు..
ఉత్సవాల్లో భాగంగా తన్నులు కోసం ఆలయం బయట గ్రామస్తులు, భక్తులు, పెద్దలు నిరీక్షించారు. వంశపారపర్యంగా నిర్వహిస్తున్న చిన్నహోతూరు కు చెందిన కుమారస్వామి ఆలయంలో నుంచి త్రిశూలం చేతబట్టి తల పైన పాత్రను పెట్టుకొని వేగంగా పరుగులు తీసుకుంటూ శంభో శంకర అంటూ కనపడిన వారందరిని తన్నారు. తన్నుల కోసం భక్తులు ఎగబడ్డారు. ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగా తన్నుల సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
ఊరంతా గులాబీమయం..
కొన్నేళ్ల క్రితమే గ్రామంలో ఐదు చోట్ల శ్రీ సిద్ధరామేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ముగింపు సందర్భంగా వసంతోత్సవం కోసం ఏర్పాటు చేశారు. గుంతల్లో గులాబీ రంగు నీటిని ప్రత్యేకంగా కలిపి బిందెల్లో తీసుకొని మేళతాళాలతో తీసుకువచ్చి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. పూజలు చేసిన అనంతరం ఆ బిందెలను బయటకు తీసుకువచ్చి ఆలయం బయట ఒకరిపై ఒకరు చదువుకున్నారు. దీంతో వసంతోత్సవం మొదలైంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు గులాబీ రంగు నీటిని చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. గ్రామం గులాబిరంగు మయంగా మారింది. అనంతరం ఉత్సవ మూర్తులను నందికొలు సేవతో వీధుల్లో తిరిగి దేవాలయానికి చేర్చారు. దీంతో ఉత్సవాలు ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మంజునాథ్ గౌడ్, వీరభద్ర గౌడ్, సర్పంచ్ హరికృష్ణ, ఎంపీటీసీ మౌనిక, వైకాపా నాయకులు బసవరాజు మాజీ సర్పంచ్ వరదరాజులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు