వివాదాస్పదంగా మారిన వాటర్ ప్లాంట్ నిర్మాణం

వివాదాస్పదంగా మారిన వాటర్ ప్లాంట్ నిర్మాణం
– రెండు గంటల పాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా
– తహసీల్దార్ ను అడ్డగించిన కేపి తాండా గిరిజనులు
చాగలమర్రి, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని కదిరి పురం తండా గ్రామం లో శుద్ధ జల ప్లాంటు నిర్మాణానికి కావలసిన స్థల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో లో 3 సెంట్ల గ్రామ కంఠం సంబంధించిన స్థలంలో శుద్ధ జల కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ తీర్మానం చేశారు. ఈ ప్రాంతంలో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి రాదని గ్రామానికి చెందిన కొందరు ప్రజలు వ్యతిరేకిస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ధర్నా నిర్వహించి తహసిల్దార్ చంద్రశేఖర్ నాయక్ బయటికి వెళ్లకుండా అడ్డగించారు. ఒక దశలో తహసీల్దార్, ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ఎంతో ప్రభుత్వ స్థలం ఉండగా పేదవాడైన శ్రీ రామ్ నాయక్ బండలు ఉన్న స్థలాన్ని సర్పంచ్ వర్గీయులు వాటర్ ప్లాంట్ కోసం ఎలా నిర్ణయిస్తారని వారు ధ్వజమెత్తారు. అధికారులు సర్పంచ్ వర్గానికి వత్తాసు పలుకుతున్నారంటూ సుమారు 100 మంది గిరిజనులు రెండు గంటలపాటు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కేపీ తాండ గిరిజనులతో చంద్రశేఖర్ నాయక్, ఎస్ఐ రమణయ్య, మండల విస్తరణ అధికారి నాగేంద్రయ్యలు చర్చించారు. ప్రస్తుతం నిర్ణయించిన స్థలంలో వాటర్ ప్లాంట్ కట్టడానికి వీలులేదని నిర్మాణం చేపడితే అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సర్పంచ్ గ్రామ పెద్దలతో ఈ విషయమై చర్చిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ కంఠానికి సంబంధించిన 3 సెంట్ల స్థలంలో శుద్ధ జల కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తీర్మానం కాపీని తన కిచ్చారన్నారు. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి స్వప్న, మండల విస్తరణాధికారి నాగేంద్రయ్యలకు తెలియజేయడం జరిగింది అన్నారు. ఈ ధర్నాలో గిరిజనులు గోవిందమ్మ, నాజా నాయక్, శ్రీ రాములు నాయక్, రాందాస్ నాయక్, లడ్డు నాయక్, తిరుపాల్ నాయక్ బాబు, క్రిష్ణ నాయక్, బాలు నాయక్, చంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.