
ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి
సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి
సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
నంద్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 23, (సీమకిరణం న్యూస్):-
ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. శనివారం నంద్యాల మండలం కానాల గ్రామ ఒకటవ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి అర్హులైన పేదలకు సంబంధిత పథకాల ప్రయోజనాలు అందించేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు.