ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ప్రైవేట్ అంబులెన్స్ లను ఆసుపత్రి ఆవరణలో పార్క్ చేయకూడదు
ఆసుపత్రిలో మరణించిన వారి మృత దేహాలను మహాప్రస్థానం వాహనాల్లో పంపాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించండి
ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహణ, పరిపాలన పరంగా కూడా దృష్టి పెట్టాలి
ఆసుపత్రిలోని ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన అన్ని పరికరాలు ఉండాలి
ఆసుపత్రిలోని పరిసరాలు శుభ్రంగా ఉండాలి
నాడు నేడు కింద చేపట్టిన ఆసుపత్రుల పనులను గడువు లోపు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు వైద్యం, ఏప్రిల్ 30, (సీమకిరణం న్యూస్) :
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సకాలంలో రోగులకు వైద్య సేవలు అందించడంతో పాటు నిర్వహణ, పరిపాలన పరంగా కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు వైద్యాధికారులను ఆదేశించారు..శనివారం ప్రభుత్వ మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో వైద్య, ఆరోగ్య సంబంధిత అంశాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ అంబులెన్స్ లను ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేయకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మరణించిన వారి మృత దేహాలను ఆస్పత్రికి చెందిన మహాప్రస్థానం వాహనాల్లో పంపాలన్నారు.. ప్రైవేట్ అంబులెన్స్ ల్లో పంపాల్సిన అవసరం వచ్చినపుడు ఆర్టీవో పోలీసు, మెడికల్ అధికారులతో కూడిన కమిటీ ద్వారా అంబులెన్స్ లను పంపే పద్ధతిని అమలు చేయాలన్నారు..వాహనాల రేటు ను కూడా కమిటీ నిర్ధారిస్తుందన్నారు..ఆసుపత్రిలో తగినన్ని స్ట్రెచర్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఏ పీ ఎస్ ఎమ్ ఐ డి సి నుంచి సరఫరా ఆలస్యం అయినట్లయితే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి వీటిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఆసుపత్రిలో ముఖ్యమైన విభాగాల్లో అవసరమైన అన్ని పరికరాలు పని చేసే పరిస్థితిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, వేటికి మరమ్మతులు అవసరమో వివరాలతో జాబితా తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.ప్రభుత్వ ఆస్పత్రిలో బయో మెడికల్ వేస్టేజీ రూమును రెండు నెలల లోపు నిర్మించాలని ఏపీఎమ్ఎస్ఐడిసి ఈ ఈ సదాశివ రెడ్డి ని ఆదేశించారు. అలాగే వర్షాకాలం వచ్చేలోపు ఆస్పత్రి డ్రైనేజీ సిస్టం ను కూడా సరిచేయాలని సూచించారు..ఆసుపత్రిలోని పరిసరాలు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి మెయిన్ గేటు, ఆర్చిలు కాంపౌండ్ వాల్ లకు పెయింటింగ్ వేయించాలని ఆసుపత్రి సూపరింటెన్డెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో జూన్ నెలాఖరు లో మొక్కల పెంపకం చేపట్టాలని, ఏ ఏ మొక్కలు, ఎన్ని అవసరమో వివరాలు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా మొక్కలు సరఫరా చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి ఆవరణ లోకి పందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్స్లో పారిశుద్ధ్యం, స్నానపు గదుల్లో నీటి సరఫరా తదితర అంశాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కిని ఆదేశించారు .త్వరలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ నిర్వహణకు అజెండా, తేదీ ఖరారు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నాడు నేడు కింద ఆస్పత్రుల నిర్మాణాలపై కలెక్టర్ సమీక్షిస్తూ ఆదోనిలో రూ. 475 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజి పనులను మే 15 వ తేదీ లోపు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎమ్ఎస్ఐడిసి ఈ ఈ సదాశివ రెడ్డి ని ఆదేశించారు. అలాగే రూ. 39. 64 కోట్లతో చేపడుతున్న ఆదోని ఏరియా ఆస్పత్రి, ఎమ్మిగనూరు, ఆలూరు, కోడుమూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి సి హెచ్ సి ల ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు..సమావేశంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెన్డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ,డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి , సిఎస్ఆర్ఎంఓ బి. వెంకటేశ్వరరావు,ఏపీఎమ్ఎస్ఐడిసి ఈ ఈ సదాశివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.