TELANGANA

నేటి నుండి వైయ‌స్ ష‌ర్మిల ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్ర ప్రారంభం

నేటి నుండి వైయ‌స్ ష‌ర్మిల ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్ర ప్రారంభం
◆  నార్కట్ ప‌ల్లి మండ‌లం కొండ‌పాక‌గూడెం గ్రామం నుంచే పాద‌యాత్ర పునఃప్రారంభం
– రాష్ట్ర వ్యాప్తంగా కొన‌సాగ‌నున్న పాద‌యాత్ర‌..
– బంగారు తెలంగాణలో ప్రజల బతుకుదెరువులు ఎలా ఉన్నాయో చూపించడానికే ఈ పాదయాత్ర
చిట్యాల, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయని, నీళ్లు, నిధులు, నియామ‌కాలు కల్పించ‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం అడుగ‌డుగునా విఫ‌లం అయింది. రైతులు అప్పులపాలై, ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు కావడం లేదు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ఈక్రమంలోనే ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు, వారి కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల  ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు చూపడానికి, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే.. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గతంలో వైయస్ఆర్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే వైయస్ షర్మిల 2021 అక్టోబర్ 20వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. బంగారు తెలంగాణలో ప్రజల బతుకుదెరువులు ఎలా ఉన్నాయో చూపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, యువత పడుతున్నా కష్టాలను ప్రభుత్వానికి వేలెత్తి చూపారు. ఈ పాదయాత్ర ద్వారా ఇకముందు కూడా ప్రజా సమస్యలపై గళమెత్తనున్నారు.
21రోజుల పాద‌యాత్ర సాగిందిలా.
మహానేత వైయస్ఆర్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాద‌యాత్ర ప్రారంభించారు. 2021 అక్టోబర్ 20వ తేదీన చేవేళ్లలో బహిరంగ సభ నిర్వహించి, పాదయాత్రలో తొలిఅడుగు వేశారు. దాదాపు 21 రోజుల పాటు పాదయాత్ర కొన‌సాగింది. మ‌ధ్య‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా నేపథ్యంలో దృష్ట్యా 2021 నవంబరు 9వ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ 21 రోజుల‌లో మొత్తం 237.4 కిలోమీట‌ర్లు వైయ‌స్ ష‌ర్మిల గారు ప్రయాణించారు. ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సాగింది. 15 మండ‌లాలు, 05 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను ద‌గ్గరుండి తెలుసుకున్నారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లను గుర్తించారు. వైయ‌స్ఆర్ సంక్షేమ పాల‌న తిరిగి తీసుకొస్తామ‌ని భరోసా ఇచ్చారు. ప్ర‌జ‌ల‌తో ద‌గ్గ‌రుండి మాట్లాడి, ధైర్యం చెప్పారు.  పాద‌యాత్ర‌లో భాగంగా 11 మాటముచ్చ‌ట కార్య‌క్ర‌మాలు, 6 ప‌బ్లిక్ మీటింగుల‌లో వైయ‌స్ ష‌ర్మిల ప్ర‌సంగించారు. నిరుద్యోగుల కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం దీక్ష చేశారు.
నేటి  పాదయాత్ర షెడ్యూల్.
వైయస్ షర్మిల గారి ప్రజాప్రస్థానం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని కొండపాకగూడెం గ్రామం నుంచి 21వ రోజు పాదయాత్ర శుక్రవారం పున:ప్రారంభం కానుంది. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయం నుంచి వైయస్ షర్మిల  పాదయాత్రకు బయలు దేరుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి చేరుకుంటారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కెట్ పల్లి చేరుకుంటారు. నార్కెట్ పల్లిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఎం.ఎడవెల్లి గ్రామానికి చేరుకుంటారు. 6.45 గంటలకు పోతినేనిపల్లి క్రాస్ రోడ్డుకు చేరుకుని, ప్రజలతో మాట్లాడతారని తెలిపారు.

Related Articles

Back to top button
error: Content is protected !!