అస్తిత్వ పోరాటానికి న్యాయవాదులు అండగా నిలబడాలి
రాయలసీమ అస్తిత్వ పోరాటానికి న్యాయవాదులు అండగా నిలబడాలి
– రాయలసీమ సాగునీటి సాధన సమితి
నంద్యాల టౌన్, మే 17, (సీమకిరణం న్యూస్) :
రాయలసీమ అస్తిత్వ పోరాటానికి న్యాయవాదులు అండగా నిలబడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు చట్టబద్ద హక్కులు , సాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి విషయంలో రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోని తద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. మే 31న జరుగనున్న సిద్దేశ్వర జలదీక్షను పురష్కరించుకుని నంద్యాల బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో మంగళవారం అధ్యక్షులు శ్రీనివాసులు అద్యక్ష్యతన రాయలసీమకు చట్టబద్ద నీటిహక్కులు, సిద్దేశ్వర అలుగు నిర్మాణ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధిలోనూ, త్రాగు, సాగునీటి విషయంలోనూ శతాబ్దకాలం నుంచి రాయలసీమ ప్రాంతం వివక్షతకు గురి కావడానికి మనలో అవగాహన, చైతన్యం లేకపోవడమే కారణమన్నారు. ఏ ప్రాంతమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నీరే ప్రధానమని, ఆ నీటి హక్కులకోసం జరుగుతున్న ఉద్యమాలకు న్యాయవాదులు కూడా అండగా నిలబడాలన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, బార్ అసోషియేషన్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.