రైతాంగాన్ని రక్షించుకునేందుకు పోరాటాలే మార్గం
రైతాంగాన్ని రక్షించుకునేందుకు
పోరాటాలే మార్గం
– రైతులకు ఏకం చేసి ఉద్యమాల వైపు నడిపించాలి
– జూదంగా వ్యవసాయ సాగు
– రైతు సంఘం జిల్లా మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జమలయ్య
పత్తికొండ, మే 18, (సీమకిరణం న్యూస్ ) :
రైతాంగాన్ని రక్షించుకునేందుకు పోరాటాలే మార్గమని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జమలయ్య పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా రైతు సంఘం 12వ మహాసభను పత్తికొండలోని టి.నరసింహయ్య ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. తొలుత జెండాను రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధుల సభలో జమలయ్య ప్రారంభోపన్యాసం చేస్తూ..కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆరు నెలల పాటు రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారని, చివరకు మోడీ ప్రభుత్వం దిగి వచ్చి చట్టాలను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్ లో తీర్మానం చేశారని తెలిపారు. ఆ పోరాట స్ఫూర్తితో రైతులను ఏకం చేసి ఉద్యమాల వైపు నడిపించాలని కోరారు. వ్యవసాయ సాగు జూదంగా మారిందని, రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి దశ, దిశ లేదని, రైతులను ఆదుకోక పోగా మరింత సంక్షోభంలోకి నెడుతున్నారని తెలిపారు. ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అన్నీ ధరలు పెరిగాయని, పెట్టుబడి ఖర్చు కూడా రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. ప్రభుత్వం నుండి సాయం అందని స్థితిలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులను ఆదుకునేందుకు కేరళ తరహాలో రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు చేయాలని, బడ్జెట్ లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పెద్ద కంపెనీలకు ప్రభుత్వం ఏజెంట్ గా మారిందన్నారు. రైతులకు ఆదాయం కోసం ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అస్తవ్యస్త వ్యవస్థను నిర్మూలించడానికి పోరాటం సాగించాలన్నారు. ఉచిత విద్యుత్ కోసం మరింత పోరాడాలన్నారు. కార్యదర్శి నివేదికను జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ప్రవేశపెట్టారు. అధ్యక్ష వర్గంగా మల్లయ్య, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు వ్యవహరించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కె.ప్రభాకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజినేయులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు జి.వీరశేఖర్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి పాల్గొన్నారు.