భూసేకరణ పనులను వేగవంతం చేయండి
రాజోలి రిజర్వాయర్ భూసేకరణ పనులను వేగవంతం చేయండి
– స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్
నంద్యాలు కలెక్టరేట్, మే 18, (సీమకిరణం న్యూస్):
చాగలమర్రి మండలంలో రాజోలి రిజర్వాయర్‌ను 2.95 టిఎంసిల నిల్వ సామర్థ్య నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించారు. రాజోలి రిజర్వాయర్ నిర్మాణ భూసేకరణ పనులపై జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ కుందు నదిపై రాజోలి రిజర్వాయర్‌ను 2.95 టిఎంసిల నిల్వ సామర్థ్య నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించారు. చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామంలో 206 ఎకరాలు, రాజోలి గ్రామంలో 416 ఎకరాలు, ఉయ్యాలవాడ మండలంలోని కాకరవాడ గ్రామంలో 130 ఎకరాలు, ఆర్. జంబులదిన్నె గ్రామంలో 124ఎకరాలు వెరసి మొత్తం 877 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ పనులను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎకరాకు 12.50 లక్షల ప్రకారం రైతులతో నెగోషియేట్ చేసి ధర నిర్ధారించారని కలెక్టర్ సూచించారు.