భూ రీ సర్వేను పగడ్బందీగా చేయాలి
ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఆదేశం
పెద్దకడబూరు, మే 18, (సీమకిరణం న్యూస్) :
భూ రీ సర్వేను పగడ్బందీగా చేయాలని ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం పెద్దకడబూరు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ రీ సర్వేపై తహశీల్దార్ కుమారస్వామి అధ్యక్షతన సర్వేయర్లు, వీఆర్వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆదోనిలో డివిజన్ పరిధిలో 223 గ్రామాలుగా మొదటి విడతకింద మూడవ వంతు అనగా 77 గ్రామాలలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భూ రీ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా 10 గ్రామాలలో పూర్తయిందని అన్నారు. 19 గ్రామాలలో సర్వే ప్రక్రియ జరుగుతుందన్నారు. ముఖ్యంగా పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాలలో ఎక్కువ గ్రామాలలో జరుగుతుందని స్పష్టం చేశారు. మండలంలో గవిగట్టు, బాపులదొడ్డి, పీకలబెట్ట, మేకడోణ, ముచ్చిగిరి, తారాపురం, రంగాపురం గ్రామాలలో భూ రీ సర్వే పూర్తయిందన్నారు. అలాగే చిన్నకడబూరు, కంబళదిన్నె, జాలవాడి, కంబదహాల్, బసలదొడ్డి గ్రామాలలో సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోవర్ల ద్వారా ఖచ్చితమైన భూ సరిహద్దులు వస్తాయని, రీ సర్వే వలన ఎన్నో ఏళ్లుగా పరిష్కారంకాని భూ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అన్నదమ్ముల భూములను కూడా సబ్ డివిజన్ చేయడం జరుగుతుందన్నారు. 100 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగినప్పుడు గొలుసులు ద్వారా భూములను కొలిచారని, ప్రస్తుత భూ సర్వే రోవర్ల ద్వారా డిజిటల్ సిస్టమ్ తో ఖచ్చితమైన సరిహద్దులు వస్తాయని పేర్కొన్నారు. కావున రైతులు భూ రీ సర్వేకు తమ భూ వివరాలతో సర్వేకు వచ్చిన అధికారుల సహకరించి సర్వే చేయించుకోవాలని రైతులను కోరారు. భూ రీ సర్వేను పకడ్బందీగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహేష్, మండల సర్వేయర్ అక్బర్ బాషా,వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.