ముంపు గ్రామాల నిరుపేదలను ఆదుకొండి
జిల్లా ఎస్పికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి వినతి
సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప ముంపు గ్రామాల నిరుపేదలను ఆదుకొండి
– జిల్లా ఎస్పికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి వినతి
నంద్యాల క్రైమ్, మే 18, (సీమకిరణం న్యూస్) :
సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప ముంపు గ్రామాల నిరుపేదలను ఆదుకోండని నంద్యాల జిల్లా ఎస్పికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి వినతిపత్రం సమర్పించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప గ్రామాల్లో రైతులను, చెంచు గిరిజనులను, నిరుపేదలను కొందరు అధికార దాహంతో తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వారినుండి నిరుపేదలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కోరారు. బుధవారం జిల్లా ఎస్.పి రఘువీరారెడ్డికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు అందించేందుకు శ్రీశైలం ప్రాజెక్టు క్రింద సర్వం త్యాగం చేసిన వందలాది కుటుంబాలు నేటికీ నల్లమల అడవిలో ఎత్తు పల్లాల్లో, పూరి గుడిసెల్లో చిమ్మ చీకటి అనుభవిస్తున్నారని ఆవేదన చెందారు. శ్రీశైలం రిజర్వాయర్ ముంపుకు గురై 1980లోనే కట్టుబట్టలతో ఊళ్లు వదలి ఆ గ్రామాల సమీపంలోని ఎత్తయిన అడవిలోనే అన్ని కష్టాలు అనుభవిస్తూ 42 ఏళ్ళుగా చీకటిలోనే తలదాచుకుంటున్నారని, ఏ చిన్న ఆపద కుటుంబంలో వచ్చినా రోడ్డు లేని అడవిలో కిలోమీటర్లు కాలినడక వెళ్లాల్సి వస్తుందని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి వరకు శ్రీశైలం రిజర్వాయర్లో నీరున్నప్పుడు చేపల వేట, రిజర్వాయర్లో నీరు తగ్గినప్పుడు ఆ పొలాల్లోనే ఆరుతడి పంటలు జొన్న, కంది, పెసలు, మినుములు, ప్రొద్దు తిరుగుడు, నువ్వులు తదితర పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప గ్రామాల్లో కొందరికి పక్కా గృహాలు నిర్మించిందని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చిందన్నారు. అధికార పార్టీ వారి ఆగడాలకు అడ్డుకట్టవేసి భూమిని, గ్రామాలను నమ్ముకున్న నిరుపేదలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిలు రక్షణ కల్పించి భూమి సాగుకు అవకాశం కల్పించాలని బైరెడ్డి కోరారు. పూర్తి వివరాలు సేకరించి భాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పి రఘు వీరారెడ్డి భాధితులకు హామీ ఇచ్చారు. అనంతరం భాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జానాలగూడెం గట్టుమీద వెంకటేశ్వర్లు, బయ్యన్న, పెరుమాళ్ళ తిక్కస్వామీ, మిరపం చెంచు బాలమ్మ, ఊరతనూరు తిక్కస్వామి, లక్ష్మయ్య, బలపాలతిప్పవాసులు నారాయణ, మౌలాలి, సంఘం తిక్కస్వామీ, దుర్గం పెద్ద పుల్లయ్య, నారాయణ, బయ్యన్న, శ్రీనువాసలు, ఈశ్వరయ్య, నరసింహ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.