బావిలో ఈతకు దిగిన బాలుడు గల్లంతు
బావిలో ఈతకు దిగిన బాలుడు గల్లంతు
–కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆస్పరి, మే 18, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని జొహరాపురం గ్రామంలో బుధవారం విషాదం చోటు చేకసుకుంది. తండ్రితోపాటు ఈతకు వెళ్లిన ఓ బాలుడు బావిలో పడి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. జొహరాపురం గ్రామానికి చెందిన కురువ టైలర్ వీరేష్ తన ఇద్దరు కుమారులతో కలిసి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రామ సమీపంలో ఉన్న వెంకన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈత కొడుతూ ఉన్న సమయంలో విష్ణువర్ధన్(11) అనే కుమారుడు బావిలో గల్లంతయ్యాడు. గమనించిన తండ్రి చుట్టుపక్కల వెతకగా ఎక్కడ కనిపించలేదు. బాలుడు వేసుకున్న బట్టలు బావి పక్కనే ఉండటంతో తన కుమారుడు బావిలోనే గల్లంతయ్యారని నిర్ధారణ చేసుకొని గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. గజ ఈతగాళ్లు, గ్రామ యువకులు బావిలో ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో పత్తికొండ ఫైర్ స్టేషన్ కు, ఆస్పరి పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు గ్రామస్తులు సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. బావిలో ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజన్ల ద్వారా ఆయిల్ పంపుల ద్వారా బయటకు తోడి వేస్తున్నారు. బావిలో అర్ధరాత్రి వరకు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ తెలియరాలేదు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. బాలుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు.