పసుపుల గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
గ్రామస్థులు అంతా చేయి చేయి కలిసి పసుపుల గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి :
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మే 19, (సీమకిరణం న్యూస్):
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గ్రామస్తులు అంతా చేయి చేయి కలిసి పసుపుల గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్ర తెలిసిన నాటి నుంచి మార్పుకు దోహదపడేది మహిళలే అని, పరిశుభ్రత లో కూడా కీలక పాత్ర పోషించాలన్నారు … గ్రామం పరిశుభ్రంగా ఉంచుకొనుట కోసం తడి, పొడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రాలకు ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీకి ఇచ్చిన తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు . ప్రతి మంగళ, గురు, శనివారాల్లో పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు, గ్రామంలో తిరుగుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిలో రెండు డబ్బాలు వుంచుకొని ఒక దానిలో తడి చెత్త మరొక దానికి పొడి చెత్త వేసి వచ్చిన క్లాప్ మిత్రాలకు ఇవ్వాలన్నారు. మనం చేసే పనిని ఆనందంగా, ఆహ్లాదకరంగా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదన్నారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ను వాడకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తడి చెత్త నుంచి వచ్చిన వర్మీ కంపోస్టు ద్వారా భూసారం పెరిగి మంచి పంటలు పండుతాయన్నారు. భవిష్యత్ తరాల కోసం కృత్రిమ ఎరువులకు బదులుగా వర్మి కంపోస్టును వాడటం వలన రైతులకు ఆరోగ్య వంతమైన పంటను దిగుబడి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రయోజనాలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. పాడి పశువుల నుంచి వచ్చిన వ్యర్థాలను గాలికి వదిలేయడం వలన రోగాలు వస్తాయని వాటిని మట్టితో కప్పి ఉంచడం ద్వారా మంచి ఎరువును తయారు చేసుకోవచ్చన్నారు. ఆ వ్యర్థాల ద్వారా వచ్చే ప్రమాదకర వాయువులు వలన గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందువలన గ్రామాలలో ప్రజలు అందరూ సమిష్టిగా కృషిచేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని వాటి గ్రామస్తులకు వివరించారు. చెత్తను నుండి సంపద తయారీ చేసుకోవడం పై ప్రక్రియను చేసే విధానం గూర్చి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి చెత్త సేకరణలో ముందుండి నడిపించాలని వారు ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. అనంతరం స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామస్తులు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, చెత్త నుండి వర్మీ కంపోస్ట్ ను తయారవుతున్న ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంక్రినేరేటర్ పరికరం ద్వారా వ్యర్ధాలను బూడిద చేసే ప్రకియను అడిగి తెలుసుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సరైన మాస్కులు, గ్లౌజులు అందించాలన్నారు. అనంతరం కేంద్రం అవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ శ్రీమతి బొగ్గుల శీలమ్మ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, డిఎల్పిఓ, పొదుపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.