దేశానికి ఆదర్శప్రాయంగా క్రీడాకారులు నిలవాలి
దేశానికి ఆదర్శప్రాయంగా క్రీడాకారులు నిలవాలి
విద్యార్థుల మనో వికాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి
విద్యతో పాటు క్రీడలకు కుడా ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి మరియు క్రీడాశాఖా మంత్రి ఆర్.కె.రోజా
కర్నూలు కలెక్టరేట్, మే,21 , (సీమకిరణం న్యూస్) :
దేశానికి క్రీడాకారులు ఆదర్శప్రాయంగా నిలవాలని క్రీడాశాఖా మంత్రి
ఆర్.కె.రోజా వ్యాఖ్యానించారు. పిల్లలు విద్యతో పాటు
క్రీడలకు కూడా ప్రాధాన్యమివ్వాలన్నారు.
కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియం నందు జిమ్నాస్టిక్స్ క్యాంప్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి మరియు క్రీడాశాఖా మంత్రి ఆర్.కె.రోజా ప్రారంభించారు.
ఈ సంధర్బంగా క్రీడా మంత్రి మాట్లాడుతూ కర్నూలుకు మొదటి సారి మంత్రిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కర్నూలుకు చెందిన క్రీడాకారిణి జాఫ్రిన్ డఫ్ ఒలంపిక్స్ లో మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ క్రీడాకారిణికి శాప్ ద్వారా ఏడు లక్షల ఆర్థిక సాయం అందించామన్నారు. అలాగే కిడింబి శ్రీకాంత్ గారికి ప్రభుత్వం నుండి ఐదు ఎకరాలు అకాడమీ ఏర్పాటుకు మరియు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించామన్నారు.
క్రీడలలో యువత రాణించడం వల్ల భవిష్యత్తులో వారికి మంచి ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా మునుపెన్నడూ లేనంతగా ప్రభుత్వం 1800 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సమ్మర్ క్యాంపులు జరుగుతున్నాయని, సమ్మర్ క్యాంప్ లకు షాప్ ద్వారా ఆర్థికంగా సహాయం అందుతుందన్నారు. అదే విధంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సచివాలయం ద్వారా స్పోర్ట్స్ క్లబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెడల్స్ సాధించిన వారికే కాకుండా క్రీడల మీద ఆసక్తి ఉన్న కిందిస్థాయి క్రీడాకారులు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో ఉత్సాహం కలిగినవారు ఆర్థికంగా ఇబ్బంది ఉందని మా దృష్టికి వస్తే వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వారు క్రీడల్లో రాణిస్తే వారికి మరియు వారి జిల్లాకు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు.
కర్నూలు లో స్టేడియంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులు వీక్షించడం మరియు జిమ్నాస్టిక్ క్యాంపులు ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా కర్నూలులో 66 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, 17 రకాల క్రీడలను ఆర్గనైజ్ చేయడం జరుగుతుందన్నారు. అందులో దాదాపుగా మూడు వేల మంది విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ ఫోన్లు, టాబ్స్ కు అలపడంటం వల్ల మానవ సంబంధాలు, ఆరోగ్య పాడవడంతో పాటు క్రీడలకు దూరం అయ్యారని మంత్రి పేర్కొన్నారు. అందుకుగాను ఈ సమ్మర్ క్యాంపులలో పాల్గొనడం వల్ల పిల్లలలో మనోవికాసం పెరిగి గెలుపు, ఓటమిలలో కృంగిపోకుండా తట్టుకునే శక్తి వారిలో పెంపొందుతాయన్నారు. క్రీడలను ప్రోత్సహించడం వలన పిల్లలలో చురుకుదనం పెరిగి ధృడ నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తారన్నారు. విద్యాశాఖ మంత్రి గారితో కూడా చర్చించి రాబోయే విద్యా సంవత్సరంలో మునపటి లాగా ప్రతి పాఠశాలలో కూడా క్రీడలకు ఒక పీరియడ్ ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ప్రతి విద్యార్థికి క్రీడలలో నైపుణ్యం ఉండేందుకు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమాజంలో దేనినైనా సాధించే విధంగా యువతను తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు.
ఈ సంధర్బంగా స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కర్నూలుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా కర్నూలుకు చెందిన క్రీడాకారిణి జాఫ్రిన్ షేక్ డఫ్ ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం కర్నూలుకే గర్వకారణం మరియు ఎందరికో ఆదర్శప్రాయం అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఛైర్మన్ తెలిపారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు క్రీడా రంగంలో రాణించడానికి ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వారికి అన్ని రకాలుగా సహకరించేందుకు మాకు అండదండగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామన్నారు. క్రీడల్లో రాణిస్తే కూడా మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అథారిటీమునుపటికన్నా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. శాప్ లీగ్స్ ఆర్గనైజ్ చేయడం వలన ప్రవేశ రుసుము చెల్లించి 26 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీని వలన ప్రతి జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించడం జరుగుతుందన్నారు ఇదంతా ద్వారా విజయవంతంగా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, సెట్కుర్ సిఐఓ పివి రమణ, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కోచ్ లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.