లింగ వివక్షత పై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరం
లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, వైద్యులపై చట్ట ప్రకారం శిక్షార్హులు
లింగ వివక్షత పై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మే 28, (సీమకిరణం న్యూస్) :
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని,లింగ నిర్ధారణకు పాల్పడే స్కానింగ్ సెంటర్లు, వైద్యులపై చట్ట ప్రకారం శిక్షార్హులు అని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హల్లో PC & PNDT చట్టం అమలుకు సంబంధించి డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియెట్ కమిటీ సమావేశంతో పాటు లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు, ఎసిబి కోర్టు జడ్జి, మహిళా కోర్టు ఇంచార్జి మెజిస్ట్రేట్ బి.సునీత, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి బి.రామ గిడ్డయ్య, దిశ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురూ సమానమే అని, స్త్రీ పురుషుల మధ్య వివక్ష ఉండకూడదని తెలిపారు. . స్కానింగ్ సెంటర్లకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని దుర్వినియోగం చేయరాదని, చట్ట ప్రకారం నడుచుకొని, సమాజ హితానికి కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు.. వైద్యాధికారులు స్కానింగ్ సెంటర్లను తరచూ తనిఖీ చేయాలన్నారు. లింగనిర్దారణ పరీక్షలు, భ్రూణహత్యలు, గర్భస్రావాలు జరగకుండా ఆపాలని, ఈ అంశంలో చట్టంలో పొందుపరచిన నియమాలను గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలన్నారు.ఆడ పిల్ల వద్దంటూ.. కుటుంబంలో ఎవరైనా వేధింపులకు గురి చేస్తున్నట్లు సంపూర్ణ ఆధారాలతో పిసి పీఎన్డిటీ కమిటీకి తెలియ జేయవచ్చన్నారు. “లింగ వివక్ష” జరుగుతోందని, బాధితురాలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఇతరులు కానీ.. తగు ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగ వివక్షతపై వ్యతిరేకిస్తూ, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేసే వారికి పిసి పీఎన్డిటీ కమిటీ అండగా వుంటుందన్నారు.అధికారులు, ఎన్జీవోలు, ప్రజలు అందరినీ భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎసిబి కోర్టు జడ్జి బి.సునీత మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు, వైద్యులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ కేవలం గర్భస్థ పిండానికి సంబంధించిన వ్యాధులు కనుగొనడానికి మాత్రమే చేయాలని, లింగ నిర్ధారణ కోసం ఉపయోగించరాదని తెలిపారు..అలాగే లింగ వివక్ష కారణంగా గర్భస్రావాలు జరగకూడదని సూచించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి బి.రామ గిడ్డయ్య మాట్లాడుతూ లింగ నిర్ధారణ ప్రక్రియ నిర్వహించే వారికి, చేయించుకున్న వారికి, ప్రోద్బలం చేసిన వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ ఎస్ రామాంజి నాయక్, బాల మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.