కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో క్యాత్ లాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ప్రతి నెల మొదటి శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తాం
నెలలోపు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్యాత్ లాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా టైం లైన్స్ నిర్దేశించుకుని పని చేయాలి
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్ జూన్ 04, (సీమకిరణం న్యూస్):
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో రోగులకు మెరుగైన సేవలు అందించేలా ప్రతి నెల మొదటి శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్యాత్ లాబ్ మరమ్మతులకు రూ. 9 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మరమ్మతులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నందున, అప్పటి వరకు గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఖర్చుతో రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగకూడదని, ఏ పీ ఎం ఎస్ ఐ డి అధికారులతో మాట్లాడి ఒక నెల లోపు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో క్యాత్ లాబ్ ఏర్పాటుకు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అని, దీని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా టైం లైన్స్ నిర్దేశించుకుని పని చేయాలని కలెక్టర్ ఏ పీ ఎం ఎస్ ఐ డి సి ఈ ఈ సదాశివ రెడ్డి ని ఆదేశించారు..ఆసుపత్రిలో మందులు, స్ట్రెచర్లు, వీల్ చైర్స్ తదితర పరికరాలను హెచ్ డి ఎస్ , నిధుల నుండి ఏర్పాటు చేస్తామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు..హెచ్ డి ఎస్ , ఆరోగ్యశ్రీ కి సంబంధించిన నిధుల ఖర్చు హెచ్ డి ఎస్ , పర్యవేక్షణ లో జరగాలని, ముందుగా తన ఆమోదం తీసుకుని ఖర్చు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.హాస్పిటల్ లో జనరిక్ మెడికల్ అవుట్లెట్స్ ఏర్పాటుకు కొత్తగా టెండర్లు పిలిచే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతోందని ఆరోపణల పై సమీక్షిస్తామని, ఇందుకు సంబంధించిన డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.వెంకట రంగారెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు . ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సేవలందించడం లో పొరపాట్లు జరగకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ , హెచ్ ఓ డి స్ సమీక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు..ఆయుష్మాన్ భవ కింద ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను ఆరు నెలల లోపు కంప్యూటరైజేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఐరన్ స్క్రాప్ బయో మెడికల్ ఎక్విప్మెంట్ డిస్పోజల్ కు ఒక కమిటీ ని ఏర్పాటు చేసి, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్స్రే మిషన్స్, ఆర్ఓ ప్లాంట్, మరమ్మతులు 50% పూర్తయ్యాయని, జనరేటర్ల మరమ్మతు పూర్తయిందని అధికారులు తెల్పగా, మిగిలిన వాటికి కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో 64219 మంది ఓపి పెరగడం పై విశ్లేషణ చేయాలన్నారు..ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వచ్చారు, ఏ వ్యాధి తో ఎక్కువ మంది వచ్చారు అన్న విషయాలను విశ్లేషిస్తే, ఆయా ప్రాంతాల్లోని పి హెచ్ సి,సి హెచ్ సి లను అప్రమత్తం చేసి అందుకనుగుణంగా రోగులకు సేవలు అందేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే సర్జరీస్ కు సంబంధించి మే లో ఎక్కువ సర్జరీలు అయ్యాయని దీనిపైన కూడా విశ్లేషణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి లో సమస్యల గురించి ఎప్పటికప్పుడు తనతో మాట్లాడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో ఒక వాట్సప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు..పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో క్యాత్ లాబ్ ద్వారా సేవలు అందించే క్రమంలో రోగుల నుండి డబ్బు వసూలు చేయకుండా చూడాలని సూచించారు.. ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై సూపరింటెండెంట్ తో పాటు ఆస్పత్రి ఏడి కూడా పర్యవేక్షించాలని సూచించారు.. సాలమ్మ సత్రం, క్యాంటీన్ తదితర అంశాలకు సంబంధించి ఆస్పత్రికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కర్నూలు ఆస్పత్రికి తెలంగాణ నుంచి ఎక్కువ మంది వైద్య సేవల కోసం వస్తున్నందున, వారికి ఆరోగ్యశ్రీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సూచించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు మంచి వైద్యం అందించాలని ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అదే విధంగా ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రి లో మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యాధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. సరైన వైద్యసేవలు అందడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ , ఆర్ ఎమ్ ఒ ,వివిధ విభాగాల హెచ్ ఓ డి లు సరైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రైవేట్ అంబులెన్స్ లు ఆస్పత్రి ఆవరణలో కి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఆక్సిజన్, ఫుడ్, వాషింగ్ తదితర కాంట్రాక్ట్ ఏజెన్సీలు రూల్స్ ఫాలో కావడం లేదని, సక్రమంగా రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. హెచ్ డి ఎస్ నిధులను దేనికి ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలను అందచేయాలని తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులతో ఆస్పత్రి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు . ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో డిసెక్షన్ చేసేవారికి 20,30 ఏళ్లుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు.. మామూలు ఇస్తే కానీ రిపోర్టులు ఇవ్వడంలేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆస్పత్రిలో ఎమ్.ఆర్.ఐ , సిటి స్కాన్, ఎక్స్రే వంటి పరికరాలు పని చేసేలా చూడాలన్నారు. ఏఎంసి వార్డులో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రెచర్స్, వీల్ చైర్స్, స్టాండ్స్ తదితర పరికరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు..ఆస్పత్రి గేట్లు, కాంపౌండ్ గోడలకి పెయింటింగ్స్ , ఇతర సివిల్ పనులు చేపట్టాలని, ఆస్పత్రి అవరణలో జూన్ జూలైలో ప్లాంటేషన్ చేపట్టాలని, విజయ డైరీ పార్లర్ అవుట్లెట్ ఏర్పాటు చేయాలని, జీవనధార జన ఔషధీ అవుట్లెట్స్ ఏర్పాటుకు ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేయాలని, ఇంకా ఇతర అంశాలపై కమిటీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డా.బి.వెంకటేశ్వర రావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.వెంకట రంగారెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ రామ గిడ్డయ్య, డి సి హెచ్ ఎస్ రాంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.