డ్రైనేజి నిర్మాణంపై ఆందోళన
-: అడ్డుకున్న మరో వర్గీయులు
-: భారీగా ట్రాఫిక్ కు అంతరాయం
కోడుమూరు టౌన్, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు రహదారిలోని స్థానిక పరప్ప జిన్ను సమీపంలో వున్న గుంతల్లో పేరుకుపోయిన మురికి నీరు మళ్లించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించ తలపెట్టిన డ్రైనేజి నిర్మాణం నిలిపివేసి,శాశ్వత ప్రాతిపదికన సిసి డ్రైనేజి లేదా పైప్ లైన్ వేసి కాలువల నిర్మాణం చేపట్టాలని దుకాణాల యజమానులు,కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు.శనివారం గ్రామ పంచాయితీ సర్పంచ్ భాగ్తరత్న ఆధ్వర్యంలో టిడిపి మండల అధ్యక్షురాలు కోట్ల కవితమ్మ,మాజీ సర్పంచ్ సిబి లత తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు స్థానిక కర్నూలు రోడ్డులోని పరప్ప జిన్ను ఆవరణ ముందు భాగంలోని దుకాణాల సముదాయం ముందు హిటాచితో(జెసిబి)తాత్కాలిక నిర్మాణ పనులు చేపట్టేందుకు పనులు మొదలుపెట్టారు.దీంతో అక్కడి దుకాణాల యజమాని శంకరబాబు ఆధ్వర్యంలో వ్యాపారస్తులు, స్థానికులు నిర్మాణ పనులను అడ్డుకుని జెసిబి(హిటాచి)ముందు భైఠాయించి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.మాకు గ్రామ పంచాయితీ నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే యథేచ్ఛగా భారీస్థాయిలో లోతైన గుంతలు ఎలా తవ్వుతున్నారని సర్పంచ్ ను నిలదీశారు.అలాగే అధికారుల ధౌర్జన్యం నశించాలి…శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజి నిర్మాణం చేపట్టాలని నినదించారు.దీంతో ఆందోళన ఉధృతంగా మారింది. నిర్మాణ పనుల అడ్డగించి అందోళన చేస్తున్న దుకాణాల యజమానులను కాలువ తవ్వించేందుకు వచ్చిన సర్పంచ్ తదితర టిడిపి నాయకులు పక్కకు లాగేసి దౌర్జన్యంగా దుకాణాల ముందు భాగంలో ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్డు,బండపరుపు వంటి వాటిని ధ్వంసం చేయించి ఇష్టానుసారంగా వ్యవహరించారు.దీంతో గంటన్నర పాటుగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విషయం తెలుసుకున్న ఎస్ఐ విష్ణునారాయణ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించి సమస్యను సద్దుమణిగించే దిశగా జేసీబీ డ్రైవర్ ను స్టేషన్ కు తరలించారు.దీంతో ఆగ్రహించిన టిడిపి నాయకులు సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైటాయించి నిరసన చేపట్టారు.గంటపాటు రోడ్డుపై ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.కాగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే ఇష్టారాజ్యంగా గ్రామ సర్పంచ్ ఇలా దౌర్జన్యంగా డ్రెయినేజీల నిర్మాణానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని దుకాణాల సముదాయం యజమాని శంకర్ బాబు తదితర వ్యాపారస్తులు మండిపడ్డారు.మాకు ముందుగానే నోటీసులు ఇచ్చి ఉంటే మేం సహకరించేవారమని,ఇప్పటికైనా శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు మాకెటువంటి అభ్యంతరం లేదన్నారు.ఇదిలా ఉండగా గూడూరు-కర్నూలు రహదారి మధ్య భాగంలో పెద్దఎత్తున దాదాపుగా 15అడుగుల లోతుగా గుంతలు వున్నాయి.దీనివల్ల అక్కడ భారీస్థాయిలో వర్షపునీరు,పై ప్రాంతంలో వున్న ఇళ్లలోని మురికినీరు చేరుకొని దుర్గంధం వెదజల్లుతూ సమస్య తీవ్రంగా మారింది. అంతేకాకుండా గత కొంత కాలం క్రితం కర్నూలు రహదారి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో సమస్య మరింత జఠిలమైంది.సమస్యపై దృష్టి సారించిన గ్రామ పంచాయితీ పాలకవర్గం కొద్ది రోజులు నుంచి సమస్య పరిష్కారానికి సిద్దమై అక్కడ తాత్కాలికంగా మురికినీరు మళ్లించే దిశగా 5అడుగుల వెడల్పు,12అడుగుల లోతులో భారీస్థాయిలో గుంతను తవ్వి వదిలేసి నీటిని మళ్లించాలని అవసరమైన చర్యలను చేపట్టింది.దీంతో శనివారం పనుల నిర్మాణానికి హిటాచీ తీసుకొని వచ్చింది.ఆ పనులను దుకాణాల యజమానులు,స్థానికులు అడ్డుకున్నారు.సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణ పనులను చేపట్టాలని ఎస్జి శంకరబాబు,వార్డు సభ్యులు ఆకుల రవి,బుగుడె మాధవస్వామి,మాదుగుండుశ్రీరాములు,లింగమూర్తి, రాఘవేంద్ర,రాజు,భాస్కరరెడ్డి వెంకటరాముడు షేక్షావలి వీరేంద్ర,భువనేష్ సురేష్,సిబీ ధనుంజయ,హోటల్ నాగరాజు,సత్య,షేక్షావలి తదితరులు కోరుతున్నారు.