2024 ఎన్నికల్లో వార్ వన్ సైడే
2024 ఎన్నికల్లో వార్ వన్ సైడే
నంద్యాల టౌన్ , జూన్ 06, (సీమకిరణం న్యూస్) :
మహానాడు స్ఫూర్తితో నంద్యాలలో క్లస్టర్ కమిటీ సమావేశం టీడీపీ నేతలు కార్యకర్తల్లో జోష్ నింపింది. నంద్యాల పట్టణంలోని హృదయ ఇన్ లో టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆద్వర్యంలో క్లస్టర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫారూఖ్, నంద్యాల, కర్నూలు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అబ్జర్వర్ గా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గత మూడేళ్ళుగా వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రికి పాలించే సత్తా లేదని ప్రజలు గ్రహించారని, వైసీపీ కుయుక్తులను తెదేపా శ్రేణులు, నాయకులు తిప్పికొట్టాలన్నారు. పోలవరం, రాజధాని సాధించాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మునుపట ఊపు వచ్చిందని తెదేపా నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారని గడప,గడప, బస్సు యాత్ర ఘోరంగా విఫలమైందని, జగన్ ని ప్రజలు సాగనంపే పరిస్థితికి వచ్చిందన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు క్లస్టర్ కమిటీని ఏర్పాటు చేయడంతో పార్టీి మరింత బలపడుతుందని, కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని సిఎంగా బాబుని చూడాలన్నారు. శిల్పా కుటుంబం వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారని, కేసులకు ఎవరు బయపడవద్దని, ఎంతవరకైనా కార్యకర్తల కోసం తాను అండగా నిలబడుతానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. వైసిపి హయాంలో నంద్యాల పట్టణం, గ్రామాల్లో జరిగిన పనులు చెప్పాలన్నారు. రాణి, మహారాణి వద్ద బ్రిడ్జి నేటికి పూర్తి కాలేదన్నారు. నంద్యాల పట్టణంలో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ లు నిర్మించిన ఘనత టిడిపికి దక్కిందని అన్నారు.