
ప్రైవేట్ పాఠశాలల ఫలితాలు 95% హర్షణీయం – నేల నూతల శ్రీధర్
బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 09, (సీమకిరణం న్యూస్):
2021-22 పదో తరగతి ఫలితాలలో ప్రైవేట్ పాఠశాలలు 95 శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని అపస్మా జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలను స్థానిక వివేకనంద పాఠశాలలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు 55 శాతం అయితే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఉత్తీర్ణత మాత్రం 95% శాతం రావడం సంతోషంగా ఉందన్నారు. మండలంలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 323 మంది పరీక్షలు రాయగా అందులో 282 మంది ఫలితాలలో ఘన విజయం సాధించారు అని ఆయన తెలిపారు. అంతేకాక 85 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు అన్నారు. ఇందులో 35 మంది 550 మార్కులకు పైగా సాధించారన్నారు. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల సాధన కృషితో నేడు ఈ విజయాన్ని సాధించామని హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న కాలంలో మరెన్నో మెట్లను సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపస్మా నియోజకవర్గ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, సెక్రెటరీ మున్నా, రామ సుబ్బారెడ్డి, నరసింహారావు, శ్రీనివాసులు రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.