పెండింగ్ బిల్లు ఏమీ లేవు
జరిగిన పనిని బట్టి బిల్లులు ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది
జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, జూన్ 10, (సీమకిరణం న్యూస్):
బిల్లులు రాక బతుకు చెల్లు, బిల్లులు రాక ..అప్పులు తీర్చలేక గుత్తేదారు బలవన్మరణం అని ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన గుత్తేదారు ఫక్కిరి మహబూబ్ బాషా ఆత్మహత్యకు సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త కు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. పత్రికలో పేర్కొన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఏమీ లేవు అని జరిగిన పనిని బట్టి సంబంధిత దారులకు బిల్లులను ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు పనులు పేరెంట్స్ కమిటీ ద్వారా జరుగుతాయని, అందుకు సంబంధించిన బిల్లులు పేరెంట్స్ కమిటీ అకౌంట్స్ లో జమ అవుతాయని తెలిపారు. నాబార్డ్ -xxv కి సంబంధించి ఫేస్ వన్ లో జిల్లా పరిషత్ హైస్కూల్లో శ్రీ ఉమామహేశ్వర కన్స్ట్రక్షన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో రూ.74. 91 లక్షల తో పనులు జరుగుతూ ఉన్నాయన్నారు.. ఇప్పటి వరకు జరిగిన పనిని బట్టి M Book లో రికార్డ్ అయిన ప్రకారం రూ.49 .13 లక్షల రూపాయలను గుత్తేదారుకు చెల్లించామని వివరించారు.పెండింగ్ ఏమీ లేవని తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, కాల్వబుగ్గ లో నాలుగు డార్మేటరీ ల నిర్మాణానికి సంబంధించి M/S సివిఎన్ రెడ్డి, కర్నూలు వారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనుల విలువ రూ. 204 .11 లక్షలు కాగా, ఇందులో జరిగిన పనిని బట్టి రూ.53.76 లక్షల బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్, ఓర్వకల్ లో మనబడి నాడు నేడు కింద ఫేస్ -I లో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో పనులు జరిగాయని, పనులన్నీ పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించి రూ. 60 .81 లక్షలు పేరెంట్స్ కమిటీ ఖాతా లో జమ అయ్యాయని తెలిపారు. అలాగే హుసేనాపురం గ్రామ పంచాయతీలో రైతు భరోసా కేంద్రం-1 నిర్మాణాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ ద్వారా చేపట్టడం జరిగిందన్నారు . ప్రస్తుతం ఇది పూర్తయ్యే దశలో ఉందన్నారు. ఇప్పటివరకు జరిగిన పనికి రూ.16.56 లక్షలు చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు..అలాగే సచివాలయం నిర్మాణం కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు. హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీ ఉమామహేశ్వర కన్స్ట్రక్షన్ కర్నూలు వారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయన్నారు.. దీని అంచనా విలువ రూ . 1.85 కోట్ల కాగా, m book లో రికార్డ్ చేసిన ప్రకారము, ఇప్పటి వరకు జరిగిన పనిని బట్టి రూ.46 లక్షలు చెల్లించడం జరిగిందని కలెక్టర్ వివరించారు.