అహోబిలంలో వైభవంగా స్వాతి వేడుకలు…
-: భక్తులతో కిటకిటలాడిన అహోబిల క్షేత్రం…
ఆళ్లగడ్డ టౌన్, జూన్ 11, (సీమకిరణం న్యూస్) :
నల్లమల అరణ్యం లో వెలిసిన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వాతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి నల్లమల అరణ్యం లో వెలిసిన నవ నారసింహులను కాలి నడకన దర్శించుకున్నారు. అహోబిలం లో స్వయంభువుగా వెలిసిన నరసింహ స్వామి,చెంచులక్ష్మి అమ్మవార్లను,ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, దిగువ అహోబిలం లో వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్లను, ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు వేకువజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలం లో అద్దాల మండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం కొలువు ఉంచి స్వామి అమ్మవార్ల ఎదుట సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు. పూర్ణాహుతి ముగియగానే హోమం నుండి వెలువడిన కాటుకను, సుదర్శన కంకణాలను భక్తులకు అందజేశారు. స్వాతి, శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఎగువ అహోబిలం లో స్వామిని క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకున్నారు.