
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్
24 గంటలు ప్రజలకు సేవలందిస్తాం
మహిళల భద్రతకు , శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తాం.
సెబ్ ఎన్ ఫోర్స్ మెంట్ పనితీరును బలోపేతం చేస్తాం.
ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతాం.
ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, సైబర్ నేరాల నివారణకు కృషి చేస్తాం.
అన్ని ప్రభుత్వ శాఖల సహాకారం, సమన్వయంతో కలిసి పని చేస్తాం.
అసాంఘిక కార్యక్రమాల పై స్పెషల్ డ్రైవ్ చేపడతాం.
ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు పోలీసు యంత్రాంగానికి సమాచారం అందిస్తే సమస్యను బట్టి తగిన చర్యలు తీసుకుంటాం.
కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్
కర్నూలు క్రైమ్, జూన్ 23, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల లో భాగంగా ఇంతకుమునుపు కర్నూలు జిల్లా ఎస్పీ గా పనిచేసిన సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ కోనసీమ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ కర్నూలు జిల్లా ఎస్పీగా గురువారం జల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ కి పూరోహితులు ఆశీస్సులు అందజేశారు. జిల్లా ఎస్పీ పోలీసుఅధికారులతో మాట్లాడారు.
శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి గురించి…
2012 ఐపియస్ బ్యాచ్ కు చెందిన సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, మొదటిసారిగా గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించారు. పార్వతీపురం , విశాఖపట్నం నందు ఏఎస్పీగా , గుంతకల్ , ప్రకాశం , కృష్ణా జిల్లాలలో ఎస్పీగా విధులు నిర్వహించారు. 2018 లో ఎస్పీగా పదోన్నతి పొంది మొదట గుంతకల్ ఎస్పీగా , 2019 నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా చేశారు . 2021 జులై 14 నుంచి కృష్ణా జిల్లాలో ఎస్పీగా పనిచేస్తూ బదిలీ పై 2022 జూన్ 23 న కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిజిపికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఇది వరకు పని చేసిన జిల్లా ఎస్పీ సిహెచ్ . సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ బాగా పని చేశారన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామన్నారు. మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సప్ లో ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామన్నారు. గుట్కా, గంజాయి, అక్రమ మద్యం, అక్రమ ఇసుక, రవాణా , నాటు సారా తయారీ అరికడతామన్నారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైనీ ఐపియస్ ధీరజ్ కునిబిల్లి, అడిషనల్ ఎస్పీలు ప్రసాద్, నాగబాబు, డిస్పీలు కెవి మహేష్, వినోద్ కుమార్, యుగంధర్ బాబు, ఇలియాజ్ భాషా, రవీంద్రా రెడ్డి, డిపిఓ ఎఓ సురేష్ బాబు, సిఐలు, ఆర్ ఐలు, పోలీసు అధికారుల సంఘం వారు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.