• మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి శ్రీకృష్ణదేవరాయల వారిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
• వైకుంఠం ప్రభాకర్ చౌదరి బలిజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి
• కాపు సంక్షేమ యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు
కర్నూలు టౌన్, జూన్ 24, (సీమకిరణం న్యూస్) :
అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి శ్రీకృష్ణదేవరాయల వారిని అవమానం పరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అలాగే బలిజలకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని కాపు సంక్షేమ యువ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు కాపు సంక్షేమ యువ సేన నుండి ప్రభాకర్ చౌదరి తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా మీరూ గెలిచినా, అంతకు ముందు మునిసిపల్ ఛైర్మన్ గా గెలిచినా బలిజల ఓట్లతో అన్నది మరిచిపోవద్దని వైకుంఠం ప్రభాకర్ చౌదరిని హెచ్చరించారు. తక్షణమే అనంతపురం నడిబొడ్డున ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పాలాభిషేకం చేసి క్షమాపణలు చెప్పాలని, అలా చేయని పక్షంలో మీకు అనంతపురం నగరంలో అరభై వేలకు పైగా ఉన్న బలిజలం రాజకీయ సమాధి కట్టాల్సి ఉంటుందన్నారు. క్షమాపణలు చెప్పక పోతే వైకుంఠం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.